చనిపోయిన పాపకు 3 రోజులు చికిత్స చేశారు : తల్లిదండ్రులు

చనిపోయిన పాపకు 3 రోజులు చికిత్స చేశారు : తల్లిదండ్రులు

సికింద్రాబాద్ : ఆరునెలల పసికందు. శ్వాస ఆడక ఇబ్బందిపడింది. ప్రాణం కాపాడండి అంటూ ప్రైవేటు హాస్పిటల్ కు చేర్చారు ఆ పేదింటి తల్లిదండ్రులు. ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పడంతో… తమ తాహతుకు మించి డబ్బులు తెచ్చి ఇచ్చారు. ఆరునెలల పసికందును బాగానే ఉందంటూ చేతికి ఇచ్చినట్టే ఇచ్చారు. అంతలోనే మళ్లీ ఐసీయూలో చేర్చి చికిత్స అందించారు. ఐనా..  ఆ పాప ప్రాణం పోయింది. తల్లిదండ్రులు తీవ్రమైన మనోవేదన అనుభవిస్తున్నారు. డబ్బుల కట్టలేదనే కారణంతో పాప చనిపోయిన విషయం చెప్పలేదని… డాక్టర్లు ట్రీట్ మెంట్ కొనసాగించారని ఆరోపించారు. ఈ సంఘటన తార్నాకలో జరిగింది.

ముషీరాబాద్ కు చెందిన రంజిత్- అనూష… తమ పాప సహస్రను 25 రోజుల కింద తార్నాకలోని ఇన్నోవా హాస్పిటల్ లో చేర్చారు. 6 నెలల వయసున్న పాప గుండె సంబంధిత వ్యాధితో బాధపడింది. ట్రీట్ మెంట్ కోసం హాస్పిటల్ డాక్టర్లు… రూ.2.5లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. ఆ తల్లిదండ్రులు రూ.2 లక్షలు కట్టి … తమ పాపను ఎలాగైనా బతికించండి అని వేడుకున్నారు. డాక్టర్లు పాపకు హార్ట్ ఆపరేషన్ చేశారు. ప్రాబ్లమ్ ఏమీ లేదు అని.. 14 రోజుల కింద ఐసీయూ నుంచి జనరల్ వార్డ్ షిఫ్ట్ చేశారు. అబ్జర్వేషన్ లో ఉండగానే…  పాప మళ్ళీ హార్ట్ సమస్యతో బాధపడింది. శ్వాస అందడం లేదంటూ… పాపను మళ్లీ ఐసీయూకు షిఫ్ట్ చేశారు. ఇవాళ ఉదయం పాప చనిపోయింది డాక్టర్లు చెప్పారు.

ఐతే… ఐసీయూ బిల్లు రూ.2లక్షలు కట్టాలని డాక్టర్లు కోరినట్టుగా తల్లిదండ్రులు చెప్పారు. 3,4 రోజుల ముందే పాప కదలకుండా అయిపోయిందని అన్నారు. ఏమైందంటే సీరియస్ గా ఉందని చెబుతూ వచ్చారని అన్నారు. తాము ఐసీయూ ఫీజు ఇంకా కట్టకపోయేసరికి… చనిపోయిన పాపకు సీరియస్ గా ఉందంటూ 4 రోజుల నుంచి చెబుతూ వచ్చారని అన్నారు. ఈ ఉదయం పాప చనిపోయిన విషయం చెప్పారని అన్నారు. డాక్టర్ల తీరుపై తల్లిదండ్రులు, బంధువులు సీరియస్ అయ్యారు. హాస్పిటల్ ముందు ఆందోళనకు దిగారు. స్థానిక కార్పొరేటర్ ఆలకుంట్ల సరస్వతి వచ్చి సమస్యను అడిగి తెలుసుకుని.. బాధితులకు న్యాయం చేస్తామని చెప్పారు.