దిశ కేసు దర్యాప్తునకు 7 స్పెషల్‌ టీమ్స్‌

దిశ కేసు దర్యాప్తునకు 7 స్పెషల్‌ టీమ్స్‌

సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఆధ్వర్యంలో ఏర్పాటు
నెల రోజుల్లో చార్జ్ షీట్ ఫైల్ చేసేందుకు కసరత్తు
పోలీస్ కస్టడీలో నలుగురు నిందితులు
మొదటి రోజు కీలక ఆధారాల సేకరణ
సీన్ ఆఫ్ అఫెన్స్, క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్..​ వీడియో రికార్డ్
టోల్ గేట్ దగ్గర్లో దిశ ఫోన్ పాతిపెట్టిన నిందితులు
శివ, నవీన్​ను తీసుకెళ్లి వెలికితీత..
లారీలో బ్లడ్ శాంపిల్స్, ఫింగర్ ప్రింట్స్ సేకరణ

హైదరాబాద్, వెలుగు:దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘జస్టిస్ ఫర్ దిశ’ అత్యాచారం, హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఫాస్ట్​ట్రాక్​కోర్టులో సమర్పించేందుకు కీలక సాక్ష్యాధారాలను సేకరిస్తున్నారు. ఇందుకోసం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఆధ్వర్యంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్)ను గురువారం ఏర్పాటు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు మహ్మద్ ఆరిఫ్ తోపాటు జొల్లు శివ, జొల్లు నవీన్, చింతకుంట చెన్నకేశవులును ఏడు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతి ఇస్తూ షాద్ నగర్ కోర్టు బుధవారం ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో చర్లపల్లి జైలులో  జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న నిందితులను గురువారం సిట్ తన కస్టడీలోకి తీసుకుంది. నిందితులను విచారించిన పోలీసులు కీలక ఆధారాలను సేకరించారు.

లారీలో మరోసారి తనిఖీలు

సీన్ ఆఫ్ అఫెన్స్ తోపాటు దిశ హత్య జరిగిన రోజు నిందితులు తిరిగిన ప్రాంతాలు, సాక్ష్యాధారాలను మాయం చేసేందుకు ప్రయత్నించిన వివరాలను సిట్ టీమ్స్ రికార్డ్ చేస్తున్నాయి. నలుగురు నిందితులను గురువారం తెల్లవారుజామున కస్టడీలోకి తీసుకుని తొండుపల్లి టోల్ గేట్ తోపాటు షాద్ నగర్​లోని చటాన్ పల్లి, కొత్తూర్ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. సీన్ ఆఫ్ అఫెన్స్, క్రైమ్ సీన్ రీకన్‌‌‌‌‌‌‌‌స్ట్రక్షన్​ను పూర్తిగా వీడియో రికార్డ్ చేస్తున్నట్లు తెలిసింది. కేసు దర్యాప్తులో కీలకంగా మారిన సీసీటీవీల ఫుటేజ్, దిశ కాల్ డేటాను అనాలసిస్‌‌‌‌‌‌‌‌ చేసి టెక్నికల్‌‌‌‌‌‌‌‌ ఎవిడెన్స్‌‌‌‌‌‌‌‌ డాక్యుమెంట్లను తయారు చేస్తున్నారు. నిందితులు పెట్రోల్ కొన్న బంక్, స్కూటీలో గాలి నింపించేందుకు వెళ్లిన ప్రాంతాల్లో మరోసారి ఆధారాలు సేకరించారు. షాద్ నగర్ బస్ స్టాండ్ ఆవరణలో ఉన్న లారీలో మరోసారి క్లూస్ టీమ్ తనిఖీలు చేసింది. లారీ క్యాబిన్ తోపాటు దిశ మృతదేహాన్ని పడేసినట్లుగా చెబుతున్న ప్రాంతంలో బ్లడ్ శాంపిల్స్, వెంట్రుకలు, ఫింగర్ ప్రింట్స్ ను సేకరించారు.

50 మంది పోలీసులతో టీమ్

నెల రోజుల్లోగా చార్జ్ షీట్ ఫైల్ చేసేందుకు సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కస్టడీ రిపోర్ట్, నిందితుల స్టేట్ మెంట్స్ తో కూడిన చార్జ్ షీట్స్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తో ప్రొడ్యూస్ చేసేందుకు పనిచేస్తోంది. సిట్ ను ఏడు టీమ్స్ గా విభజించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. నలుగురు అడిషనల్ డీసీపీలతో కలిపి ఇందులో ఒక్కో టీమ్ ను 8 మంది పోలీసులతో ఏర్పాటు చేశారు. ఇలా మొత్తం 50 మందికిపైగా సిబ్బంది దర్యాప్తులో భాగమయ్యారు. ఈ ఏడు టీమ్స్​ను శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి లీడ్ చేస్తున్నారు. ఒక టీమ్ టెక్నికల్ ఎవిడెన్సెస్, ఫోరెన్సిక్ నివేదికలను సేకరిస్తుంది. మరో టీమ్ లీగల్ ప్రొసీడింగ్స్​కి కావలిసిన డాక్యుమెంట్స్ తయారు చేస్తుంది. ప్రత్యక్ష సాక్షులను విచారించేందుకు, స్టేట్ మెంట్స్ రికార్డ్ చేసేందుకు మరో టీమ్ పనిచేస్తుంది.