
- ప్రొటీన్ లోపం.. ఎక్సర్ సైజ్ లేకపోవడమే కారణం
- 30 నుంచి 55ఏళ్లమధ్య వారిలో సమస్య
- సిటీలో 70 శాతం మందిబాధితులు
- ఇండియా మజిల్హెల్త్ సర్వేలో వెల్లడి
హైదరాబాద్, వెలుగు: సిటీలో కండరాల సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. పటుత్వం తగ్గి శరీరం బలహీనపడుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎముకలను అనుసంధానం చేస్తూ శరీరం దృఢంగా ఉండేందుకు కండరాల పాత్ర కీలకంగా ఉంటుందని, పటుత్వం తగ్గడంతో ఆరోగ్యం దెబ్బతింటుందని ఇన్ బాడీ సంస్థ వెల్లడించింది. ఇండియా మజిల్ హెల్త్ సర్వే పేరిట దేశ వ్యాప్తంగా మెట్రో సిటీల్లో ఈ సంస్థ ప్రతి సంవత్సరం సర్వే నిర్వహిస్తోంది. కండరాల బలహీనతతో బాధపడుతున్న వారు నగరంలో సుమారు 70శాతం మంది వరకు ఉన్నట్లు సర్వేలో గుర్తించారు. పాట్నా, లక్నో మొదటి రెండు స్థానాల్లో ఉండగా, మూడో స్థానంలో హైదరాబాద్ ఉన్నట్టు వెల్లడించారు.
35 నుంచి 55 సంవత్సరాల వారు కండరాల బలహీనతతో బాధపడుతున్నట్లు సర్వేలో తేలింది. మారిన ఆహారపు అలవాట్లు, జీవనశైలితో కండరాలకు కావల్సిన ప్రొటీన్స్ అందడం లేదు. 19 నుంచి 35 లోపు వయసున్న వారు సరైన పౌష్టిక ఆహారం తీసుకోకపోవడం.. జంక్పుడ్స్, వ్యాయామం లేకపోవడం, ఆల్కాహల్ తీసుకోవడం వంటివి సమస్యలకు కారణమవుతున్నట్టు నిపుణులు వెల్లడిస్తున్నారు. పౌష్ఠికాహార లోపంతో శరీరంలో కొవ్వు మోతాదు తగ్గి కండరాలు పటుత్వం కొల్పోతాయని, దీంతో ఎముకల పటిష్టం తగ్గి బాడీ మొత్తం వీక్ అవుతుంది. సిటీలో సుమారు 1500 మందిపై సర్వే నిర్వహించగా 30 నుంచి 55 ఏళ్లు వారు 70 శాతం మంది బాధితులుగా ఉన్నట్టు సర్వే రిపోర్టు తెలియజేస్తోంది. టీనేజ్లో సరైన ఆహారం తీసుకోక పోవడంతోనే సమస్యలు వస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. రోజు చిన్నపిల్లలు 200 నుంచి 250 గ్రాములు, పెద్దలు 400 గ్రాముల వరకు పండ్లు, కూరగాయలు తీసుకుంటే కండరాలు పరిపుష్టిగా మారి దృఢంగా తయారవుతాయని డాక్టర్లు
పేర్కొంటున్నరు.
వ్యాయామం లేకపోవడంతోనే
టీనేజ్లో ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం, బాడీకి వ్యాయామం లేకపోవడంతో మజిల్స్ వీక్ అవుతాయి. రక్తహీనత సమస్య ఉన్నవారిలో కూడా కండరాలు బలహీనంగా ఉంటాయి. తొందరగా అలసిపోయి, చిన్నపాటి పని కూడా చేయలేరు. నిత్యం సరైన ఆహారం తీసుకొని వ్యాయామం చేస్తే కండరాలు పటిష్టంగా ఉంటాయి.
– డాక్టర్ శంకర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఉస్మానియా హాస్పిటల్