
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాల చివరిఘట్టానికి చేరుకున్నాయి. ఇవాళ ఆఖరి రోజు కావడంతో భక్తులు పోటెత్తారు. భారీ సంఖ్యలో పుణ్యస్నానం ఆచరించి, సరస్వతి మాతకు మొక్కులు చెల్లించారు భక్తులు. సరస్వతి మాత విగ్రహాన్ని దర్శించుకున్న అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని శుభానందదేవి అమ్మవారిని దర్శించి మొక్కలు చెల్లించుకున్నారు భక్తజనం. సాయంత్రం జరిగిన సరస్వతీ నది హారతి కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, ప్రత్యేక సీఎస్ వికాస్ రాజ్ హాజరయ్యారు.
మే 15 నుంచి మే 26 వరకు 12రోజులపాటు అంగరంగ వైభవంగా కొనసాగాయి సరస్వతీ పుష్కరాలు. పలు రాష్ట్రాల నుంచి12 రోజుల పాటు సుమారు 70 లక్షల పైగా మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారుల అంచనా వేశారు. ఈ పుష్కరాల్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు, సీఎం రేవంత్ రెడ్డి , మంత్రులు, పీఠాధిపతులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, హైకోర్టు జడ్జీలు, సిని పరిశ్రమ నటులు, అధికారులు పుణ్యస్నానం చేశారు.
ప్రభుత్వం కాళేశ్వరం పుష్కరాలకు పకడ్భందీగా ఏర్పాట్లు చేసింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంది. పటిష్ట పోలీస్ బందోబస్తుతో ఏర్పాటు చేసింది. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే భక్తుల కోసం 15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు 790 బస్సులు ఏర్పాటు చేసింది.