70th Filmfare Awards 2026 : 70వ సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2026.. నామినేషన్ల జాబితాలో ఉన్న టాలీవుడ్ సినిమాలు ఇవే!

70th Filmfare Awards 2026 : 70వ సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2026.. నామినేషన్ల జాబితాలో ఉన్న టాలీవుడ్ సినిమాలు ఇవే!

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 70వ సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ 2026 వేడుకకు రంగం సిద్ధమైంది.  చిత్రపరిశ్రమలోని నటీనటుల ప్రతిభను గుర్తిస్తూ అందించే వేడుక ఈ నెల ఫిబ్రవరి 21న కేరళలోని కొచ్చి వేదికగా కన్నుల పండువగా జరగనుంది. లేటెస్ట్ గాఈ ఫిలింఫేర్ అవర్డ్స్ నామినేషన్ల జాబితా విడుదలైంది. ఈ నామినేషన్ల జాబితాలో తెలుగు సినిమాలు మనుపెన్నడూ లేని విధంగా సత్తా చాటాయి.

టాలీవుడ్ బాక్సాఫీస్ హిట్స్ వర్సెస్ క్లాసిక్స్

ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా తెలుగు, తమిళం, కన్నడ , మలయాళం భాషల చిత్రాలు వివిధ విభాగాల్లో పోటీపడుతున్నాయి. 2024 సంవత్సరంలో విడుదలైన చిత్రాలను పరిశీలించి  ఈ ఏడాది అవార్డుల కోసం ఎంపిక చేశారు. ఆ ఏడాది టాలీవుడ్‌కు ఒక స్వర్ణయుగం అని చెప్పాలి. ఒకవైపు భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాలు, మరోవైపు కంటెంట్ ఉన్న చిన్న సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి.  ముఖ్యంగా 'పుష్ప 2: ది రూల్', 'కల్కి 2898 ఏడీ', 'హనుమాన్' వంటి భారీ చిత్రాలతో పాటు '35 చిన్న కథ కాదు', 'లక్కీ భాస్కర్' వంటి వైవిధ్యమైన సినిమాలు పోటీలో నిలిచాయి. 

నామినేషన్ల హోరాహోరీ.. ఎవరు ఏ విభాగంలో?

ఈ ఏడాది నామినేషన్లలో విభిన్న శైలి గల చిత్రాల మధ్య గట్టి పోటీ నెలకొంది.   ఉత్తమ చిత్రాల రేసులో మాస్ మసాలా, సోషియో ఫాంటసీ, ఎమోషనల్ డ్రామాలు తలపడుతున్నాయి. ఉత్తమ చిత్రాల జబితాలో 35 చిన్న కథ కాదు, కమిటీ కుర్రోళ్లు, హనుమాన్, కల్కి 2898 ఏడీ, లక్కీ భాస్కర్, పుష్ప 2: ది రూల్ పోటీ పడుతున్నాయి.  

ఉత్తమ దర్శకులు విభాగంలో  నాగ అశ్విన్ (కల్కి), సుకుమార్ (పుష్ప 2), ప్రశాంత్ వర్మ (హనుమాన్), వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్) వంటి వారు తమ మార్క్ మేకింగ్‌తో నామినేట్ అయ్యారు.

ఉత్తమ నటుడు  విభాగంలో పోటీ చాలా తీవ్రంగా ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన 'పుష్ప' మేనరిజంతో, జూనియర్ ఎన్టీఆర్ 'దేవర'లోని గంభీరత్వంతో, నాని 'సరిపోదా శనివారం'లోని విభిన్న నటనతో పోటీపడుతున్నారు. వీరితో పాటు సిద్ధూ జొన్నలగడ్డ, తేజ సజ్జ, దుల్కర్ సల్మాన్ కూడా రేసులో ఉన్నారు.

ఉత్తమ నటి విభాగంలో చూస్తే  లేడీ ఓరియంటెడ్ పాత్రలకు పెద్దపీట వేస్తూ.. నివేదా థామస్ (35 చిన్న కథ కాదు) తన సహజ నటనతో నామినేట్ అవ్వగా, రష్మిక మందన్న (పుష్ప 2), అనుపమ పరమేశ్వరన్ (టిల్లు స్క్వేర్) , ఆషికా రంగనాథ్ ( నా సామి రంగ ) , మీనాక్షి చౌదరి ( లక్కీ భాస్కర్, ప్రియాంక మోహన్ ( సరిపోదా శనివారం )  వంటి గ్లామరస్ తారలు కూడా పోటీలో ఉన్నారు.

సపోర్టింగ్ రోల్స్‌లో దిగ్గజాల పోటీపడుతున్నారు. ఈసారి నామినేషన్లలో ప్రత్యేక ఆకర్షణ ఏమిటంటే.. అమితాబ్ బచ్చన్ (కల్కి 2898 ఏడీ) వంటి లెజెండరీ నటులు ఉత్తమ సహాయ నటుడి విభాగంలో నామినేట్ కావడం. అలాగే ఫహద్ ఫాజిల్ (  షుష్ప 2), ఎస్‌జే సూర్య ( సరిపోదా శనివారం ) సత్య ( మత్తు వదలరా 2) , వినయ్ రాయ్ ( హనుమాన్ ) వంటి ప్రతిభావంతులు ఈ రేసులో ఉన్నారు..

దక్షిణాదిలోని నాలుగు భాషల చిత్రాలకు ఒకే వేదికపై అవార్డులు అందించడం ఫిల్మ్‌ఫేర్ ప్రత్యేకత. ఈ ఏడాది మలయాళ చిత్ర పరిశ్రమ నుండి 'ఆడుజీవితం', 'మంజుమ్మెల్ బాయ్స్' వంటి చిత్రాలు కూడా భారీ స్థాయిలో పోటీ పడుతున్నాయి. ఈ అవార్డుల వేడుక కేవలం విజేతలను ప్రకటించే వేదిక మాత్రమే కాదు, దక్షిణాది సినిమా సత్తాను ప్రపంచానికి చాటిచెప్పే సంబరం. మరి ఈ ఫిబ్రవరి 21న ఆ 'నల్ల సుందరి'ని ముద్దాడే అదృష్టం ఎవరికి దక్కుతుందో చూడాలి!