714 నోటిఫికేషన్ రద్దు చేయాలని ఆటోవాలాల డిమాండ్

714 నోటిఫికేషన్ రద్దు చేయాలని ఆటోవాలాల డిమాండ్
  • కరోనాతో మూడేండ్లుగా ఫిట్​నెస్​కు దూరమైన డ్రైవర్లు
  • ఒక్కో ఆటోకు రూ.30 వేలకు పైగా ఫైన్​
  •    ఫిట్​నెస్​ చేయని వెహికల్స్​పై రోజుకు రూ.50 లేట్​ ఫీజు 
  •   సంవత్సరానికి రూ.18 వేలు కట్టాల్సిందే 
  •  గతంలో రెండు వేలలోపే జరిమానా

మంచిర్యాల, వెలుగు : రోడ్ సేఫ్టీలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 714 నోటిఫికేషన్ ఆటోవాలాలకు గుదిబండగా మారింది. దీని ప్రకారం ఫిట్​నెస్​లేట్ ఫీజు రోజుకు రూ.50 చొప్పున ఏడాదికి రూ.18వేలు చెల్లించాల్సి వస్తోంది. కరోనా కాలానికి కూడా లేట్ ఫీజు వర్తింపచేయడంతో ఆటోడ్రైవర్లు ఆగమవుతున్నారు. తాము రోజుకు సంపాదించేదే వందో, రెండు వందలో అని, అసలే గిరాకీల్లేక తిండికి తిప్పలు పడుతుంటే..వేలల్లో లేట్ ఫీజు ఎక్కడినుంచి తెచ్చి కట్టాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 714 నోటిఫికేషన్​ను ఆటోలకు మినహాయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు మార్చి 27, 28 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా ఆటోలు బంద్ పెట్టి నిరసన తెలుపగా, ఈ నెల 19న హైదరాబాద్ ఇందిరాపార్క్ దగ్గర ధర్నా చేశారు. ప్రభుత్వం స్పందించేంత వరకు పోరాటాలు కొనసాగిస్తామని ఆటో యూనియన్ లీడర్లు చెబుతున్నారు.  

ఉద్దేశం మంచిదే కానీ.. 

మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం రోడ్డుపై తిరిగే అన్ని ప్యాసింజర్, గూడ్స్ వెహికల్స్​కు ఫిట్​నెస్​టెస్ట్ తప్పనిసరి. కానీ చాలామంది వాహనదారులు సకాలంలో ఫిట్​నెస్​చేయించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. వెహికల్స్ ఫిట్​నెస్​లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనిని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం మోటార్ వెహికల్ యాక్ట్ 2019లో భాగంగా మినిస్ర్టీ ఆఫ్ రోడ్ ట్రాన్స్​పోర్ట్​అండ్ హైవేస్ నోటిఫికేషన్ 714 తీసుకొచ్చింది. ఇందులో చాలా అంశాలు ఉన్నప్పటికీ ఫిట్​నెస్​లేట్ ఫీజు అనేది వాహనదారులకు ముఖ్యంగా ఆటోవాలాలకు భారంగా మారింది. రాష్ర్టవ్యాప్తంగా 6 లక్షల ప్యాసింజర్ ఆటోలు ఉండగా, హైదరాబాద్ జంటనగరాల్లోనే 2లక్షలకు పైగా ఉన్నాయి.

ఫీజు రూ.750... లేట్​ఫీజు రూ.వేలల్లో... 

ఆటోలకు ఫిట్​నెస్​ఫీజు సర్వీస్ చార్జీ, పోస్టల్ చార్జీ కలిపి రూ.735 చెల్లిస్తే చాలు. సకాలంలో ఫిట్​నెస్​చేయించుకోకపోతే మాత్రం రోజుకు రూ.50 చొప్పున ఫైన్ కట్టాల్సిందే. కరోనా టైమ్​లో ఆటోలు నడవక చాలామంది తిండికి తిప్పలు పడ్డారు. ఫైనాన్స్ కిస్తీలు, వడ్డీలు కట్టలేకపోయారు. దీంతో మెజారిటీ ఆటోవాలాలు తమ వాహనాలకు రెండు, మూడేండ్లుగా ఫిట్​నెస్​టెస్ట్​ చేయించలేపోయారు. గతంలో ఆర్టీఏ ఆఫీసర్ల తనిఖీల్లో పట్టుబడితే వెయ్యి లేదా రెండు వేల ఫైన్ వేసి విడిచిపెట్టేవారు. ఏప్రిల్ నుంచి 714 నోటిఫికేషన్ అమల్లోకి రావడంతో ఫిట్​నెస్​లేట్ ఫీజు రోజుకు రూ.50 చొప్పున వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన ఏడాదికి రూ.18వేలు, రెండేండ్లకు రూ.36వేలు, మూడు సంవత్సరాలకు రూ.54వేల ఫైన్ వేస్తున్నారు. 
ఆటో అమ్ముకునుడే...
నేను ముప్పై ఏండ్ల నుంచి ఆటో నడుపుతున్న. రోజుంతా నడిపితేనే నాలుగైదు వందలు వస్తయ్. ఇందులో డీజిల్​, ఇతర ఖర్చులు పోను రెండు వందలు మిగులుతయ్. కరోనా లాక్​డౌన్​నుంచి గిరాకీలు లేవు. డీజిల్, పెట్రోల్​తో పాటు అన్ని రేట్లు పెరగడంతో పూట గడవడమే కష్టంగా ఉంది. రెండేండ్ల నుంచి ఆటోకు ఫిట్​నెస్​చేయించలే. ఇప్పుడు రోజుకు రూ.50 చొప్పున రూ.36వేలు కట్టాలంటే నాతోని అయితదా? ఆటో అమ్ముకొని వేరే పని చూసుకోవాలె. 
- మొగిలి యాదవ్, ఆటోడ్రైవర్, మంచిర్యాల
ఆదుకోవాల్సింది పోయి...
 రోజంతా ఆటో నడిపినా తిండికి సరిపోను డబ్బులు రాని రోజులు కూడా ఉన్నాయి. కరోనా టైంలో అప్పులు చేసి కుటుంబాలు నెట్టుకు రావాల్సి వచ్చింది. ఆ అప్పులే ఇప్పుడు తీరుస్తున్నం. ఫైనాన్స్ కిస్తీలు, ఇన్సూరెన్స్, టాక్స్​కట్టలేకపోతున్నం. సర్కారు ఆదుకోవాల్సింది పోయి ఫిట్​నెస్​లేట్​ఫీజు పేరిట వేలల్లో భారం మోపడం న్యాయమా? మానవత్వంతో ఆలోచించి 714 నోటిఫికేషన్ రద్దు చేయాలె. లేదంటే ఆటో డ్రైవర్లంతా రోడ్డున పడతారు.  
పొట్ట మధుకర్, ఆటో యూనియన్ లీడర్