రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లా భివాడి పారిశ్రామిక ప్రాంతంలో సోమవారం ఉదయం పెను విషాదం చోటుచేసుకుంది. ఖుస్ఖేడ-కరౌలి పారిశ్రామిక వాడలోని ఒక కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 8 మంది కార్మికులు సజీవ దహనమయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో సుమారు 25 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో లోపల చిక్కుకున్న వారు బయటకు తీసుకొచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ఉదయం 9:22 గంటల ప్రాంతంలో ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలోనే మంటలు ఫ్యాక్టరీ మొత్తానికి వ్యాపించాయి. లోపల ఉన్న రసాయనాలు మంటలను తీవ్రతరం చేయటంతో నల్లటి దట్టమైన పొగ కిలోమీటర్ల మేర వ్యాపించింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక కేంద్రం నుంచి 10కి పైగా ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకున్నాయి. పోలీసులు సాధారణ గస్తీలో ఉన్న సమయంలో ఈ మంటలను గమనించి వెంటనే సహాయక చర్యలు ప్రారంభించినట్లు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ సుమితా మిశ్రా తెలిపారు.
అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఇప్పటివరకు 8 మృతదేహాలను వెలికితీశారు. అయితే మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. మరికొందరు కార్మికులు లోపల చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. తీవ్రంగా గాయపడిన పలువురిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై రాజస్థాన్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. భద్రతా ప్రమాణాల ఉల్లంఘన జరిగిందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
