హైదరాబాద్, వెలుగు: సివిల్ సప్లయ్స్ ఆధ్వర్యంలో జిల్లాకు ఒక పెట్రోల్ బంకు ఏర్పాటులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 9 పెట్రోల్ బంకులను ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపామని సివిల్ సప్లయ్స్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ వెల్లడించారు. తాజాగా అనుమతించిన పెట్రోల్ బంకుల్లో కొత్తగూడెం జిల్లాలో జూలూరుపాడు, మేడ్చల్ జిల్లాలో ఆలియాబాద్, అత్వెల్లి, ఖమ్మం జిల్లాలో రఘునాథపాలెం, కరీంనగర్‌లో హస్నాపూర్, రంగారెడ్డి జిల్లాలో కిస్మత్‌పుర, సంగారెడ్డి జిల్లాలో కంది, జగిత్యాల జిల్లాలో కోరుట్ల, మెదక్ జిల్లాలో నర్సాపూర్‌లో ఈ పెట్రోల్ బంకులు ఏర్పాటు చేస్తున్నామని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లాల్లో సంస్థ పెట్రోల్ బంకుల ఏర్పాటుకు అనువైన భూమిని గుర్తించి ఆయిల్ కంపెనీలకు బంకులు కేటాయించేందుకు ఐదుగురు సభ్యులతో కమిటీ వేశామని తెలిపారు. ఈ కమిటీతో సమావేశమై తొలి విడతలో 9 బంకులకు ఆమోదం తెలిపామని చెప్పారు. రెండో దశలో మరో పది జిల్లాలకు పెట్రోల్ బంకులు ఏర్పాటుచేసే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించామని పేర్కొన్నారు. తాజా నిర్ణయం ద్వారా సంస్థకు రూ.2 కోట్ల ఆదాయం లభిస్తుందని ఆయన వెల్లడించారు.
