- ముగిసిన పాలిటెక్నిక్ అడ్మిషన్ల ఫైనల్ ఫేజ్
- ఎయిర్‌క్రాఫ్ట్, ప్యాకేజింగ్ కోర్సుల్లో 100% సీట్లు భర్తీ
- ఈ నెల 22 లోగా ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో దాదాపుగా సీట్లన్నీ నిండిపోయాయి. గవర్నమెంట్ కాలేజీల్లో 92 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా సర్కారు, ప్రైవేటు కాలేజీల్లో 33,535 సీట్లు అందుబాటులో ఉండగా, ఫైనల్ ఫేజ్ ముగిసేసరికి 25,111 (75 శాతం) సీట్లు భర్తీ అయ్యాయని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ ఏ. శ్రీదేవసేన శుక్రవారం తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 59 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో 18,538 సీట్లు ఉండగా.. ఏకంగా 17,001 సీట్లు నిండిపోయాయి. మరోవైపు, 53 ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో 14,997 సీట్లు ఉంటే.. కేవలం 8,110 (54 శాతం) సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. అంటే ప్రైవేటులో దాదాపు సగం సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. ఈడబ్ల్యూఎస్ కోటా కింద 2,132 సీట్లు భర్తీ అయినట్లు శ్రీదేవసేన వివరించారు.
కొత్త బ్రాంచ్‌లకు ఫుల్ డిమాండ్
మారుతున్న టెక్నాలజీకి తగ్గట్టుగా కొత్త కోర్సుల పట్ల విద్యార్థులు ఆసక్తి చూపారు. ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీరింగ్, ప్యాకేజింగ్ టెక్నాలజీ వంటి బ్రాంచ్‌ల్లో వంద శాతం సీట్లు నిండాయి. సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ 96.21 శాతం, క్లౌడ్ కంప్యూటింగ్ 94.44 శాతం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 89.63 శాతం, సెమీ కండక్టర్ టెక్నాలజీ 88.78 శాతం సీట్లు నిండాయి. మొత్తంగా సీఎస్ఈలో 5,478 (74 శాతం), ఈసీఈలో 4,129 (69.42 శాతం), ఈఈఈలో 4,094 (68.45 శాతం), మెకానికల్‌లో 2,924 (76 శాతం), సివిల్‌లో 2,866 (76 శాతం) సీట్లు భర్తీ అయ్యాయి.
మాసబ్ ట్యాంక్ పాలిటెక్నిక్, సికింద్రాబాద్ ఐఓఈఎస్, నిజామాబాద్, రామంతాపూర్, మేడ్చెల్, సిద్దిపేట, వరంగల్ సర్కారు కాలేజీల్లో దాదాపు అన్ని సీట్లు నిండాయి. సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 22వ తేదీ లోగా ఆన్‌లైన్ ద్వారా ట్యూషన్ ఫీజు చెల్లించి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని కమిషనర్ సూచించారు. అనంతరం ఈ నెల 20 నుంచి 23వ తేదీ లోపు కేటాయించిన కాలేజీల్లో ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు స్వయంగా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కాగా, ఒకే కాలేజీలో బ్రాంచ్ మార్చుకోవాలనుకునే వారు ఈ నెల 27, 28 తేదీల్లో ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు.
