హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పీఈసెట్) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది పరీక్ష రాసిన వారిలో మొత్తం 94.32 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించారు. శనివారం హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్‌లో శాతవాహన వర్సిటీ వీసీ ఉమేశ్ కుమార్‌తో కలిసి టీజీసీహెచ్ఈ చైర్మన్ బాలకిష్టారెడ్డి రిజల్ట్స్ రిలీజ్ చేశారు. మే 31 నుంచి జూన్ 3 వరకు ఈ ప్రవేశ పరీక్షలు జరిగాయి.
మొత్తం 3,298 మంది దరఖాస్తు చేసుకోగా.. 2,449 మంది పరీక్షకు హాజరయ్యారు. వారిలో 2,310 మంది క్వాలిఫై అయ్యారు. బీపీఈడీ కోర్సు కోసం 1,795 మంది పరీక్ష రాయగా1,689 (94.09%) మంది పాసయ్యారు. డీపీఈడీ కోసం 654 మంది పరీక్ష రాయగా.. 621 (94.95%) మంది అర్హత సాధించారు. పరీక్ష రాసిన అభ్యర్థులు తమ ర్యాంకు కార్డులను అధికారిక వెబ్‌సైట్ https://pecet.tgche.ac.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పీఈసెట్ కన్వీనర్ తెలిపారు.
