రాత్రికి రాత్రే రేటు తగ్గిస్తరా?

రాత్రికి రాత్రే రేటు తగ్గిస్తరా?
  • పత్తి ధర తగ్గడంతో రోడ్డెక్కిన రైతన్న
  • ఆదిలాబాద్‌లో ధర్నా.. మార్కెట్ యార్డు గేట్లు మూత

బోథ్ ​(ఆదిలాబాద్​), వెలుగు: రాత్రికి రాత్రి పత్తి ధర తగ్గించడంతో ఆదిలాబాద్‌లో రైతులు ఆందోళనకు దిగారు. వ్యాపారులే కావాలని ధరలను తగ్గిస్తున్నారంటూ మార్కెట్ యార్డు గేట్లను తలపాగాతో కట్టి మూసేశారు. తర్వాత రోడ్డుపైకి చేరుకుని ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 దాకా ధర్నా చేశారు. ధర తగ్గించారనే ఆవేదనతో ఓ రైతు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. రేటు తగ్గించిన విషయం తెలుసుకుని చుట్టుపక్కల గ్రామాల రైతులు కూడా వచ్చి నిరసనల్లో పాల్గొన్నారు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది.

సాయంత్రం ఒక ధర.. పొద్దున ఇంకో ధర

శుక్రవారం సాయంత్రం దాకా క్వింటాల్ పత్తి ధర రూ.8,130 ఉంది. శనివారం అదే ధర ఉంటుందని భావించిన చాలా మంది రైతులు భారీగా పత్తిని మార్కెట్‌కు తరలించారు. కానీ రేటును రూ.7,960కి తగ్గించినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో వారితో రైతులు వాగ్వాదానికి దిగారు. ఎంత ప్రయత్నించినా ధర తగ్గించకపోవడంతో స్థానిక పంజాబ్ చౌరస్తాకు చేరుకొని నిరసన తెలిపారు. వ్యాపారులే ధరలను తగ్గిస్తున్నారని ఆవేదనకు గురైన ఓ రైతు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు.

పోలీసులు వెంటనే అడ్డుకుని పెట్రోల్ డబ్బాను లాక్కున్నారు. రైతుపై నీళ్లు పోసి అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం నాయకులు, రైతు సంఘాల నాయకులు ధర్నాలో పాల్గొన్నారు. న్యాయం జరిగేంత వరకు ఆందోళనను విరమించేది లేదని రోడ్డుపై బైఠాయించారు. విషయం తెలుసుకున్న అడిషనల్ కలెక్టర్ నటరాజన్ అక్కడికి చేరుకుని రైతులకు సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వారు వినలేదు. దీంతో వ్యాపారులతో మాట్లాడి పత్తి ధరను క్వింటాల్ రూ.8 వేలకు పెంచేందుకు ఒప్పించారు. ఆ తర్వాతే రైతులు ఆందోళన విరమించారు.