కొడుకును చంపి తండ్రి ఆత్మహత్య..నల్గొండ పట్టణంలో ఘటన

కొడుకును చంపి తండ్రి ఆత్మహత్య..నల్గొండ పట్టణంలో ఘటన
  • మానసిక ఒత్తిడే కారణమని అనుమానాలు

నల్గొండ, వెలుగు : ఓ వ్యక్తి తన కొడుకును సుత్తితో కొట్టి చంపిన తర్వాత తాను కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నల్గొండ పట్టణంలో సోమవారం జరిగింది. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ పట్టణానికి చెందిన పబ్బతిరెడ్డి లింగారెడ్డి (42) విద్యుత్‌‌ శాఖలో జేఎల్‌‌ఎంగా పనిచేస్తున్నాడు. 

లింగారెడ్డి భార్య కవిత.. తన పెద్ద కుమారుడు ప్రశాంత్‌‌రెడ్డిని హాస్టల్‌‌లో చేర్చేందుకు హైదరాబాద్‌‌కు వెళ్లింది. సాయంత్రం కవిత తిరిగి వచ్చే సరికి ఇంటి మెయిన్‌‌ గేటు లోపలివైపు గడియపెట్టి ఉంది. ఎన్ని సార్లు ఫోన్‌‌ చేసినా లింగారెడ్డి లిఫ్ట్‌‌ చేయకపోవడంతో... పక్కనే ఉన్న అబ్బాయిని పిలిచి గేటు పైనుంచి లోపలికి దింపి గడియ తీయించింది. 

తర్వాత ఇంట్లోకి వెళ్లి చూడగా... లింగారెడ్డి, చిన్న కొడుకు ప్రణీత్‌‌రెడ్డి హాల్‌‌లో చనిపోయి కనిపించారు. ప్రణీత్‌‌రెడ్డి తలపై నాలుగు గాయాలు కనిపించగా, లింగారెడ్డి నోటి వెంట నురగలు వచ్చి చనిపోయి ఉన్నాడు. సమచారం అందుకున్న నల్గొండ వన్‌‌టౌన్‌‌ సీఐ రాజశేఖర్‌‌రెడ్డి, ఎస్సై జె. సైదులు, ఎన్. వెంకటనారాయణ తమ సిబ్బందితో ఘటనాస్థలానికి చేరుకున్నారు. 

క్లూస్‌‌ టీమ్, డాగ్‌‌ స్క్వాడ్‌‌ను రప్పించి ఆధారాలను సేకరించారు. మృతుడి తండ్రి పబ్బతిరెడ్డి సత్తిరెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు వన్‌‌ టౌన్‌‌ పోలీసులు తెలిపారు. ఇద్దరి డెడ్‌‌బాడీల పక్కనే సుత్తి, పురుగుల మందు డబ్బా కనిపించాయి. దీంతో సుత్తితో కుమారుడిని కొట్టి చంపిన అనంతరం లింగారెడ్డి పురుగుల మందు తాగి చనిపోయి ఉంటాడని ప్రాథమికంగా నిర్ధారించారు. 

మానసిక ఒత్తిడే కారణమా ? 

లింగారెడ్డి, ప్రణీణ్‌‌రెడ్డి ఇద్దరూ మూడేండ్ల కింద ఓ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అప్పటి నుంచి క్రమం తప్పకుండా మందులు వాడుతున్నారు. ఈ క్రమంలోనే తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన లింగారెడ్డి కొడుకును చంపిన తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకొని ఉంటాడని
 అనుమానిస్తున్నారు.