నా మీద కక్షతోనే కేసీఆర్ SLBCని పక్కన పడేసిండు ..2028 ఆగస్టుకు సొరంగం ద్వారా 4 లక్షల ఎకరాలకు నీళ్లిస్తాం

నా మీద కక్షతోనే కేసీఆర్ SLBCని పక్కన పడేసిండు ..2028 ఆగస్టుకు సొరంగం ద్వారా 4 లక్షల ఎకరాలకు నీళ్లిస్తాం
  •     మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 
  •     2028 ఆగస్టు నాటికి సొరంగం పూర్తి చేసి 4 లక్షల ఎకరాలకు నీళ్లిస్తామని వెల్లడి

నల్గొండ, వెలుగు: తనపై ఉన్న వ్యక్తిగత కక్షతోనే పదేళ్ల బీఆర్ఎస్  పాలనలో కేసీఆర్  ఎస్ఎల్బీసీ పనులను పక్కన పడేశారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. అప్పుడే ఎస్ఎల్బీసీ పనులు పూర్తయి ఉంటే నల్గొండ జిల్లాకు కరువే ఉండేది కాదన్నారు. శనివారం నల్గొండ, తిప్పర్తి మండలాల్లో మంత్రి పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జీతభత్యాలు తీసుకుంటూ అసెంబ్లీకి రాని కేసీఆర్  మళ్లీ అధికారంలోకి ఎలా వస్తాడని ప్రశ్నించారు. 

కేటీఆర్  అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నాడని, రాష్ట్రంలో మళ్లీ వచ్చేది కాంగ్రెస్  ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్, ఖమ్మం జిల్లాల్లో కాంగ్రెస్  క్లీన్  స్వీప్  చేస్తుందని జోస్యం చెప్పారు. సీనియర్  మంత్రిగా తనను సీఎం రేవంత్ రెడ్డి గౌరవిస్తారని, జిల్లా అభివృద్ధి కోసం తాను ఏది అడిగినా కాదనరని తెలిపారు. 

2028 ఆగస్టు నాటికి ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని పూర్తి చేసి నల్గొండ జిల్లాలోని 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే తన జీవిత ఆశయమని స్పష్టం చేశారు. 2007లో ప్రారంభించిన సొరంగం గతంలో దురదృష్టవశాత్తు కూలిపోయిందని, ఇటీవల అమెరికా నుంచి ప్రత్యేక బేరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు తెప్పించి పనులను మళ్లీ స్పీడప్​ చేశామని తెలిపారు. శ్రీశైలంలో డెడ్  స్టోరేజీ ఉన్నప్పటికీ ఎస్ఎల్బీసీ ద్వారా నీరు అందుతుందని చెప్పారు. 

రాష్ట్రవ్యాప్తంగా రవాణా సౌకర్యాలు మెరుగు పర్చేందుకు రూ.13 వేల కోట్లతో హ్యామ్ రోడ్లు, రూ.7 వేల కోట్లతో ఆర్అండ్ బీ రోడ్ల పనులు చేపడుతున్నామని మంత్రి తెలిపారు. రెండు మూడేళ్లలో ప్రతి గూడేనికి బీటీ రోడ్డు వేస్తామన్నారు. అడిషనల్​ కలెక్టర్  ప్రేమ్ కరణ్ రెడ్డి, డీఆర్డీవో శేఖర్ రెడ్డి, ఆర్డీవో వై.అశోక్ రెడ్డి, పీఆర్​ ఈఈ గిరిధర్, ఆర్అండ్ బీ ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈ మోహన్, ఈఈ శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.