మాజీ ఎమ్మెల్యే తమ్ముడి వేధింపులతో యువకుడు సూసైడ్!

మాజీ ఎమ్మెల్యే తమ్ముడి వేధింపులతో  యువకుడు సూసైడ్!
  • కూకట్​పల్లి పీఎస్​లో కేసు నమోదు

కూకట్​పల్లి, వెలుగు: కుత్బుల్లాపూర్ ​మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ ​తమ్ముడు శ్రీనివాస్​గౌడ్ ​వేధింపులతో తన భర్త  సూసైడ్ ​చేసుకున్నాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.  కూకట్​పల్లిలోని వెంకటరావునగర్​కు చెందిన అంకెనపల్లి కుమార్​(28) ఎనిమిదేండ్లుగా బాచుపల్లిలోని శ్రీనివాస్​గౌడ్​కు చెందిన సమ్మక్క సారక్క క్రషర్​ కంపెనీలో అకౌంటెంట్​గా పని చేస్తున్నాడు. 

ఇటీవల లెక్కల్లో రూ.కోటి తేడా వచ్చిందని పేర్కొంటూ శ్రీనివాస్​గౌడ్​తో పాటు సంస్థ సిబ్బంది కుమార్​ను నిలదీశారు. తనకేమీ తెలియదని కుమార్​ చెప్పినప్పటికీ రూ.కోటి సంస్థకు చెల్లించాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. పలుమార్లు కుమార్​ను సంస్థ కార్యాలయంలో తీవ్రంగా కొట్టి గాయపరిచారు. 

లెక్కల్లో తేడా వచ్చిన డబ్బు చెల్లించకపోతే మీ ఇంటికి వచ్చి కుటుంబు సభ్యులను కూడా ఇబ్బంది పెడుతామని బెదిరించారు. పలుమార్లు ఇంటి వద్ద ఉన్న కుమార్​ను కార్యాలయానికి పిలిపించి మరీ కొడుతుండేవారు. ఈ విషయం తెలుసుకున్న కుమార్​ అత్తయ్య డబ్బు విషయం గురించి సోమవారం మాట్లాడుకుందామని శ్రీనివాస్​గౌడ్​కు తెలిపింది. అయితే తీవ్ర భయాందోళనలకు గురైన కుమార్​ఆదివారం రాత్రే ఇంట్లో ఫ్యాన్​కు ఉరేసుకుని సూసైడ్​చేసుకున్నాడు. ఈ మేరకు కుమార్​ భార్య మౌనిక ఫిర్యాదు చేయడంతో కూకట్​పల్లి పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.