సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఘరానా మోసం

సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఘరానా మోసం
  • రిసెప్షనిస్ట్ జాబ్ ల పేరిట యువతులకు గాలం 
  • న్యూడ్ ఫొటోలు సేకరించి బ్లాక్ మెయిల్
  • వందల్లో బాధితులు
  • నిందితుడి అరెస్ట్

చందానగర్, వెలుగు : అతడి వృత్తి సాఫ్ట్​వేర్​ఉద్యోగం. ప్రవృత్తి జాబ్​ల పేరిట యువతులకు ఎర వేయడం.. రిసెప్షనిస్ట్​ ఉద్యోగాలిప్పిస్తానని మోసం చేసిన నిందితుడిని మియాపూర్​ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడుకు చెందిన క్లెమెంట్ రాజు(33)  చెన్నైలో టీసీఎస్​ కంపెనీలో  సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. క్విక్కర్. కామ్​ ద్వారా రిసెప్షనిస్ట్​ ఉద్యోగాల కోసం రిజిస్ర్టేషన్​ చేసుకున్న యువతులు, మహిళల ఫోన్​ నెంబర్లను స్వీకరిస్తాడు.

ప్రముఖ రాడిసన్​ హోటల్​లో రిసెప్షనిస్ట్​ ఉద్యోగం ఇప్పిస్తాం అంటూ ఫోన్​లో పరిచయం పెంచుకుంటాడు. ఉద్యోగం రావాలంటే మొత్తం నాలుగు రౌండ్ల ఇంటర్వ్యూ పూర్తి చేయాలని తెలియజేస్తాడు.  తనకు న్యూడ్​ ఫొటోలు పంపించాలని అదంతా ఇంటర్వ్యూలో భాగమేనని నమ్మబలుకుతాడు. పంపిన తరువాత వారిని బ్లాక్​మెయిల్​ చేస్తాడు. మియాపూర్​ ప్రాంతానికి చెందిన ఓ యువతిని  న్యూడ్​ ఫోటోలు పంపించాలని రాజు కోరాడు. అనుమానం వచ్చిన సదరు యువతి మియాపూర్​ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎస్​ఐ రఘురామ్​ దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం నిందితుడు రాజును  అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు.

16 రాష్ట్రాల్లో బాధితులు

రాజు వందలాది మంది యువతులను మోసం చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. దాదాపు 16 రాష్ర్టాలకు చెందిన 800 నుండి 1000 మంది యువతులను జాబ్​ల పేరిట న్యూడ్​ ఫోటోలు సేకరించి వారిని బ్లాక్​ మెయిలింగ్​ చేసినట్లు రాజు ఫోన్​లో దొరికిన ఫొటోల ఆధారంగా పోలీసులు ధృవీకరించారు. తెలంగాణ రాష్ర్టానికి చెందిన వారు సుమారు 60 నుండి 80 మంది బాధితులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు అతని వద్ద నుండి మరిన్ని వివరాలు సేకరించే పనిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.