కరెంట్ శాఖలో విప్లవం ఆటో రీక్లోజర్...ఎక్కడ పవర్ ట్రిప్ అయినా 20 సెకన్లలోనే వచ్చేస్తది

కరెంట్ శాఖలో విప్లవం ఆటో రీక్లోజర్...ఎక్కడ పవర్ ట్రిప్ అయినా 20 సెకన్లలోనే వచ్చేస్తది
  • ఎక్కడ పవర్ ​ట్రిప్ ​అయినా 20 సెకన్లలోనే వచ్చేస్తది 
  • మనుషుల అవసరమే ఉండదు
  • అంతా ఆటోమెటికే...కృష్ణానగర్​లోప్రయోగాత్మకంగా అమలు  
  • సక్సెస్​ అయితే రాష్ట్రవ్యాప్తంగా అమలు  


హైదరాబాద్ సిటీ, వెలుగు:  టీజీఎస్పీడీసీఎల్ అందుబాటులోకి తీసుకువచ్చిన కొత్త వ్యవస్థ ఒకటి విద్యుత్ రంగంలో కీలకంగా మారనున్నది. కొద్ది రోజుల నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఆటో రీక్లోజర్ అనే సిస్టమ్​ఇప్పుడు ఆసక్తిని రేపుతున్నది.  ఆటో రీ క్లోజర్ అనేది విద్యుత్ పంపిణీ వ్యవస్థలో వాడే ఒక సర్క్యూట్ బ్రేకర్. ఇది కరెంట్​లైన్లలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు సరఫరాను ఆపేసి మళ్లీ ఆటోమేటిక్‌‌‌‌గా పునరుద్ధరిస్తుంది. ఉదాహరణకు మనం ఇండ్లల్లో వాడే ఎంసీబీలు ట్రిప్ అయితే మనం చేత్తో ఆన్ చేయాల్సి ఉంటుంది. కానీ, ఆటో రీ క్లోజర్ మనుషుల అవసరం లేకుండానే లైన్‌‌‌‌ను తిరిగి ఆన్ చేస్తుంది. అది కూడా కేవలం 20 సెకన్లలోనే... ప్రస్తుతం బంజారాహిల్స్ కృష్ణానగర్ 33 కేవీ సబ్‌‌‌‌ స్టేషన్‌‌‌‌లో దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. సక్సెస్​అయితే, ఈ టెక్నాలజీని రాష్ట్రమంతటా విస్తరించాలని విద్యుత్​శాఖాధికారులు భావిస్తున్నారు.  

 ఏమిటిది?  

ఇంటెలిజెంట్ ఎలక్ట్రానిక్ డివైస్ (ఐఈడీ) అనేది సబ్‌‌‌‌స్టేషన్లకు మెదడు లాంటిది. ఇది పవర్ సిస్టమ్స్‌‌‌‌ను పర్యవేక్షిస్తుంది. పవర్ గ్రిడ్‌‌‌‌లోని వోల్టేజ్, కరెంట్ లైవ్ డేటాను సేకరించి, విశ్లేషించి, అవసరమైనప్పుడు సరైన నిర్ణయం తీసుకుంటుంది. ఆటో రీ క్లోజర్​కూడా దీని కిందకే వస్తుంది.  పాత పద్ధతిలో లైన్ ట్రిప్ అయితే సిబ్బంది మాన్యువల్‌‌‌‌గా బటన్ నొక్కాల్సి వచ్చేది. దీనికి కొన్ని నిమిషాలు పట్టేది. కానీ, ఈ ఆటో రీ క్లోజర్ వల్ల కేవలం 20 సెకన్లలోనే పవర్​ను పునరుద్ధరిస్తుంది. 

ఎలా పని చేస్తుంది? 

విద్యుత్ లైన్లపై జరిగే ప్రమాదాల్లో 80 శాతం నుంచి 90 శాతం వరకు తాత్కాలికమైనవే ఉంటాయి.  ఉదాహరణకు గాలికి చెట్ల కొమ్మలు తీగలకు తగలడం, పక్షులు వాలడం, పిడుగులు పడడం, బలమైన గాలికి వైర్లు ఒకదానికొకటి తాకడం లాంటివి జరిగినప్పుడు సెన్సార్ల ద్వారా లైన్ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తుంది. ట్రిప్ అయిన వెంటనే ఐఈడీ రిలేలోని సాఫ్ట్‌‌‌‌వేర్ సెకన్లలో అక్కడ జరిగిన లోపం టెంపరరీనా లేక పర్మినెంటా అని విశ్లేషిస్తుంది. తాత్కాలికం అని తేలితే, వెంటనే సర్క్యూట్‌‌‌‌ క్లోజ్ చేసి పవర్‌‌‌‌ను రీస్టోర్ చేస్తుంది. దీంతో ట్రాన్స్‌‌‌‌ఫార్మర్ల కు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ ఈదురుగాలుల టైంలో స్తంభాలు పడిపోతే ఆటోమేటిక్‌‌‌‌గా విద్యుత్​సరఫరాను ఆపేస్తుంది. ఎక్కడైనా ఏదైనా ప్రమాదకరమైన లోపం ఉన్నట్టు గుర్తిస్తే పవర్‌‌‌‌ ఆఫ్​చేస్తుంది. ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ప్రయత్నించినా కాకపోతే లాక్ అవుట్ మోడ్‌‌‌‌లోకి వెళ్లిపోతుంది. తర్వాత లైన్‌‌‌‌మెన్ క్లియరెన్స్ ఇచ్చే వరకు పవర్ ఆన్ కాదు. ఒకవేళ రిలేలోని సెన్సార్లు ఫెయిలైతే సబ్‌‌‌‌స్టేషన్ సిబ్బంది ఎప్పటిలాగే కంట్రోల్ రూమ్ నుంచే సరఫరా నియంత్రించవచ్చు. గ్రామాల్లో చెట్ల వల్ల ఎక్కువగా కరెంట్​పోతూ ఉంటుంది. అక్కడ కూడా ఆటో రీక్లోజర్​వ్యవస్థ ఏర్పాటు చేస్తే రైతులకు, గ్రామస్తులకు ఉపయోగకరంగా ఉంటుంది. బయటి ఇంటర్నెట్‌‌‌‌తో సంబంధం ఉండదు కాబట్టి హ్యాకింగ్ లేదా సైబర్ దాడుల ముప్పు కూడా చాలా తక్కువ. ప్రైవేట్ డిస్కంలైన టాటా పవర్, అదానీ పవర్ లో ఈ టెక్నాలజీ 
వాడుతున్నారు. 

రెప్పపాటు కరెంట్ ​కట్​లు ఉండవ్​

ఆటో రీక్లోజర్ల వల్ల రెప్పపాటు పవర్‌‌‌‌కట్‌‌‌‌లు తప్పుతాయి. టీవీ చూస్తున్నప్పుడు లేదా ముఖ్యమైన పనుల్లో ఉన్నప్పుడు కరెంట్ పోయి గంటల తరబడి ఎదురుచూడాల్సిన అవసరముండడదు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారికి ఐటీ ఉద్యోగులకు ఇది వరం. వైఫై రూటర్లు,  కంప్యూటర్లు పవర్ పోయిన వెంటనే ఆగిపోకుండా, యూపీఎస్ బ్యాకప్ లోడ్ తీసుకోకముందే కరెంట్ తిరిగి వస్తుంది. ఇండస్ట్రీల్లో కరెంట్​ఒక్క నిమిషం పోయినా మెషీన్లు ఆగిపోయి ఉత్పత్తికి భారీ నష్టం జరుగుతుంది. ఈ వ్యవస్థ వల్ల ఆ అంతరాయం సెకన్లకే పరిమితమై, మళ్లీ మెషీన్లను రీస్టార్ట్ చేసే శ్రమ తప్పుతుంది. చిన్నపాటి వర్షాలకు వచ్చే అంతరాయాలు 90 శాతం తగ్గుతాయి. పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే మాన్యువల్ రిపేర్లు అవసరమవుతాయి. దవాఖానలు, ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూల్లో కరెంట్​పోతే బ్యాకప్ జనరేటర్లు స్టార్టయ్యేలోపే ఈ వ్యవస్థ వెలుగులు నింపుతుంది. మెయింటెనెన్స్ లేని టైంలో వచ్చే సాధారణ ఫిర్యాదులు 70 నుంచి 80 శాతం వరకు తగ్గే అవకాశం ఉంటుందని అధికారుల అంచనా వేస్తున్నారు. రాబోయే 6 నెలల నుంచి ఏడాదిలో దశలవారీగా హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాలకు దీనిని విస్తరించేందుకు టీజీఎస్పీడీసీఎల్ ప్లాన్ చేస్తోంది.