ఎస్సీ వర్గీకరణ హామీ విషయంలో బీజేపీ మోసం చేసింది

ఎస్సీ వర్గీకరణ హామీ విషయంలో బీజేపీ మోసం చేసింది
  • MRPS  శాంతియుత ర్యాలీ ప్రారంభం

MRPS అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తలపెట్టిన శాంతియుత ర్యాలీ ప్రారంభమైంది. సికింద్రాబాద్ పార్శిగుట్టలోని MRPS కార్యాలయం నుండి ఇందిరాపార్క్ వరకు ర్యాలీ చేయాలని నిర్ణయించారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో బీజేపీ (కేంద్ర ప్రభుత్వం) సానుకూల ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ.. శాంతియుత ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ బాధ్యత తీసుకోవాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణపై గతంలో బీజేపీ నాయకులు ఇచ్చిన హామీలను గుర్తు తెచ్చుకోవాలన్నారు. వర్గీకరణ అంశంలో సానుకూల ప్రకటన రాకపోతే జరగబోయే పరిణామాలకు బీజేపీ అగ్ర నాయకులే బాధ్యత వహించాలని హెచ్చరించారు. శాంతియుతంగా, ప్రజాస్వామ్య బద్ధంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేయాలని తాము పిలువునిచ్చామన్నారు. శాంతియుతంగా ఆందోళనలు నిర్వహిస్తున్న తమను (MRPS  నేతలు, కార్యకర్తలు) అణిచి వేయడానికి ప్రయత్నిస్తే 100 రూపాల్లో తీవ్రంగా ప్రతిఘటిస్తామన్నారు. 

ఎస్సీ వర్గీకరణ అమలు విషయంలో ఇప్పటి వరకూ ముందడగు పడలేదని, తమ వర్గం వారిని బీజేపీ నేతలు విస్మరించారని మందకృష్ణ మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటులో అన్ని బిల్లులు పాస్ చేయించుకుంటున్న బీజేపీ పెద్దలు.. ఎస్సీ వర్గీకరణ విషయాన్ని మాత్రం విస్మరిస్తున్నారని అన్నారు. మాదిగలను మోసం చేయాలని చూస్తే రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. 2014 లో తాము అడుగకపోయినా ప్రధాని అభ్యర్థిగా ఉన్న మోడీ సమయం ఇచ్చి తమను కలిశారని, ఎస్సీ వర్గీకరణపై చట్టబద్దత కల్పిస్తామని అనాడే హామీ కూడా ఇచ్చారని గుర్తు చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎస్సీ వర్గీకరణపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చి ఇంతవరకు పరిష్కరించలేదని తెలిపారు. వర్గీకరణ అంశంలో స్పష్టమైన వైఖరి ప్రకటించకపోతే బీజేపీని తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదని చెప్పారు. ‘మేము అమ్ముడుపోలేదు. నమ్ముకుని ఉన్నాం. కానీ, బీజేపీ మా నమ్మకాన్ని వమ్ము చేస్తోంది’ అంటూ ఆరోపించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్న సభలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన చేయకపోతే ఎంతటివారైనా సరే ఎదురిస్తాం,  నిలదీస్తాం, పోరాడుతాం అని వ్యాఖ్యనించారు.