- ఫేక్ పేషెంట్లతో తప్పుదోవ పట్టిస్తే పర్మిషన్లు రద్దు
- కొత్త కోర్సులు, సీట్ల పెంపునకు భారీగా ఫీజులు
హైదరాబాద్, వెలుగు: వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి దేశవ్యాప్తంగా కొత్తగా పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) మెడికల్ కోర్సులను ప్రారంభించడానికి నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే ఉన్న కాలేజీల్లో సీట్లను పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. అంతేకాకుండా.. కొత్తగా స్టాండ్అలోన్ (స్వతంత్ర) పీజీ మెడికల్ ఇన్‌స్టిట్యూషన్ల ఏర్పాటుకు కూడా దరఖాస్తులను ఆహ్వానించింది.
అయితే, తనిఖీల సమయంలో సీట్ల కోసం దొంగ పేషెంట్లను చూపిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్‌ఎంసీ హెచ్చరించింది. ఎన్‌ఎంసీ మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్ (ఎంఏఆర్బీ) జారీ చేసిన నోటీసు ప్రకారం.. మార్చి 2 నుంచే ఆన్ లైన్ అప్లికేషన్ల ప్రక్రియ మొదలైంది. ఆసక్తి ఉన్న మెడికల్ కాలేజీలు మార్చి 31 వరకు ఎన్‌ఎంసీ వెబ్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. కేవలం ఆన్ లైన్ లో వచ్చిన అప్లికేషన్లను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని, ఆఫ్‌లైన్‌లో పంపితే ఆమోదించబోమని స్పష్టం చేసింది.
అద్దె పేషెంట్ల డ్రామాలకు చెక్!
తనిఖీల టైంలో ఎన్‌ఎంసీ ఆఫీసర్లను తప్పుదోవ పట్టించేందుకు చాలా కాలేజీలు అద్దె పేషెంట్లను, నకిలీ రోగులను తీసుకొస్తున్నాయని బోర్డు సీరియస్ అయ్యింది. ఇలాంటివి గుర్తిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఫేక్ పేషెంట్లను గుర్తించేందుకు ఎన్‌ఎంసీ కొన్ని రూల్స్ పెట్టింది. పీడియాట్రిక్ వార్డులో పిల్లలు ఏ జబ్బు లేకుండా హుషారుగా ఆడుకుంటున్నా, అడ్మిట్ అయిన పేషెంట్లకు జబ్బుకు సంబంధించిన టెస్టులు, బ్లడ్ రిపోర్టులు, ఎక్స్-రేలు లేకపోయినా, ఒకే ఫ్యామిలీ నుంచి గుంపుగా జనం వచ్చి అడ్మిట్ అయినా.. వీటన్నింటినీ ఫేక్ కింద పరిగణిస్తామని తేల్చి చెప్పింది. ఇలా దొరికితే కొత్త కోర్సులకు పర్మిషన్ ఇవ్వకపోగా, ఉన్న పర్మిషన్లు కూడా రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చింది.
అన్ని వసతులు ఉండాల్సిందే
పీజీ సీట్ల కోసం అప్లై చేసుకునే కాలేజీలకు ఎన్‌ఎంసీ ఫీజులు పెంచేసింది. నాన్-రీఫండబుల్ రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ. 2 లక్షలు+ 18% జీఎస్టీ చెల్లించాలి. కొత్త పీజీ కోర్సు స్టార్ట్ చేయాలన్నా, సీట్లు పెంచాలన్నా కోర్సుకు రూ.5 లక్షలు (4 సీట్ల వరకు) ఫీజు కట్టాలి. 4 సీట్ల కంటే ఎక్కువ కావాలంటే ఒక్కో సీటుకు అదనంగా రూ.1 లక్ష చెల్లించాల్సి ఉంటుంది.
అలాగే.. అప్లికేషన్ పెట్టే నాటికే కాలేజీలో పూర్తి స్థాయి వసతులు ఉండాలని ఎన్‌ఎంసీ స్పష్టం చేసింది. బిల్డింగ్ కడుతున్నాం.. పనులు జరుగుతున్నాయి లాంటి సాకులు చెబితే అప్లికేషన్లను రిజెక్ట్ చేస్తామంది. అలాగే ఫ్యాకల్టీకి బయోమెట్రిక్ హాజరు 75% తప్పనిసరిగా ఉండాలని, లేకుంటే సీట్ల పెంపు ఉండదని స్పష్టం చేసింది.
