
పిల్లలు ఉన్నచోట ఉండరు. లేనిపోని పంచాయితీలు తెచ్చిపెడుతుంటరు. అప్పటి వరకు ఆడుకుంటూనే ఏదో చిన్న కారణంతో గొడవ పడుతుంటారు. ఆ గొడవ కాస్త అపుడపుడు పెద్దదవుతుంది. ఒక్కోసారి ఈ పిల్లల పంచాయతీ తల్లిదండ్రులు గొడవ పడే పరిస్థితి వస్తుంది. మేడ్చల్ జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. ఇద్దరు చిన్నారుల గొడవ పెద్దదవడంతో ఇరు కుటుంబాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడి జరిగిన కాసేపటికే ఓ తండ్రి ప్రాణం పోయింది.
అక్టోబర్ 5న మధ్యాహ్నం మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి ఔషపూర్ లో ఇద్దరు చిన్నారులు గొడవపడటంతో అమీర్ అనే వ్యక్తి పిల్లలను మందలించాడు. అయితే తన కొడుకునే మందలిస్తావా ? అని ఆవేశంతో అలీ అనే వ్యక్తి అమీర్ ఇంటికి వెళ్ళి దాడి చేశాడు .ఇరువురు ఒకరిపై ఒకరు పిడి గుద్దులతో దాడి చేసుకున్నారు. కాసేపటికి పక్కింటి వారు సర్ధిచెప్పడంతో గొడవ కాస్త సద్గుమణిగింది.
►ALSO READ | గుడిమల్కాపూర్ లో కానిస్టేబుల్ పై చీటింగ్ కేసు
అయితే గొడవ పడిన పావుగంటలోనే తనకు ఛాతీలో నొప్పి వస్తుందని భార్య సోనీతో చెప్పాడు అమీర్. దీంతో వెంటనే అమీర్ ను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. ఆసుపత్రికి తరలించగా మార్గం మధ్యలోనే అమీర్ మృతి చెందినట్లు నిర్ధారించారు వైద్యులు. మృతుడి బంధువులు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోస్టు మార్టం కోసం అమీర్ మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు అలీ కొట్టడం వల్లే అమీర్ మృతి చెందాడా? లేదా అనారోగ్య సమస్యతో చనిపోయాడా అని దర్యాప్తు చేస్తున్నారు ఘట్ కేసర్ పోలీసులు.