నిమ్స్లో అరుదైన శస్త్రచికిత్స.. కంటి గవ్వ మార్గం ద్వారా మెదడు కణితిని తొలగించిన వైద్యులు

నిమ్స్లో  అరుదైన శస్త్రచికిత్స.. కంటి గవ్వ మార్గం ద్వారా మెదడు కణితిని తొలగించిన వైద్యులు

హైదరాబాద్ నిమ్స్ వైద్యులు అరుదైన శస్త్రచికిత్స ద్వారా మరోసారి అద్భుతం చేశారు. న్యూరో సర్జరీ విభాగం వైద్యులు అత్యాధునిక ఎండోస్కోపిక్ ట్రాన్స్‌ఆర్బిటల్ అప్రోచ్ (ETOA) పద్ధతిలో మెదడు కణితిని విజయవంతంగా తొలగించారు. కంటి గవ్వ (ఐ సాకెట్) సహజ మార్గాన్ని ఉపయోగించి ఎటువంటి గాయం లేకుండా కణితిని తొలగించడం  వైద్య రంగంలో మరో ఘనతగా పేర్కొంటున్నారు.

మెదక్ జిల్లా చిన్నశంకరపేట మండలం మధుర్ గ్రామానికి చెందిన మంగలి లత (50) అనే మహిళ తీవ్రమైన తలనొప్పితో నిమ్స్‌ లో చేరింది. కంటి వెనుక భాగంలోని పుర్రె అడుగు ప్రాంతంలో మెదడు కణితి ఉన్నట్లు  పరీక్షల్లో గుర్తించారు. సాధారణంగా ఇటువంటి కణితులను తొలగించేందుకు తల ఎముకను తెరిచే క్రానియోటమీ శస్త్రచికిత్స అవసరమవుతుంది. అయితే తక్కువ గాయంతో, వేగంగా కోలుకునే విధంగా నిమ్స్ వైద్యులు ఎండోస్కోపిక్ ట్రాన్స్‌ఆర్బిటల్ అప్రోచ్‌ను ఎంచుకున్నారు.

ఈ శస్త్రచికిత్సలో కనుబొమ్మ సహజ మడత వద్ద చిన్న కోత చేసి, హై-డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో కణితిని చేరుకొని తొలగించారు. శస్త్రచికిత్సలో అత్యాధునిక 3D న్యూరోనావిగేషన్ వ్యవస్థ, CUSA (కావిట్రాన్ అల్ట్రాసోనిక్ సర్జికల్ ఆస్పిరేటర్) సాంకేతికతలను వినియోగించి మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వంతో కణితిని పూర్తిగా తొలగించారు.

►ALSO READ | హయత్ నగర్ లో మున్సిపల్ అధికారుల ముందే.... పెట్రోల్ పోసుకొని వ్యక్తి ఆత్మహత్యాయత్నం... 

ఈ పద్ధతి ద్వారా పెద్ద ఎత్తున తల ఎముక తెరవాల్సిన అవసరం ఉండదు. సర్జరీ తర్వాత బయటకు కనిపించే మచ్చలు ఉండవు. మెదడు కణజాలానికి ఎక్కువ నష్టం కలగదు. రక్తస్రావం, ఇన్ఫెక్షన్ ప్రమాదం తగ్గడంతో పాటు రోగి త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది.

నిమ్స్ డైరెక్టర్ ప్రొ.నగరి బీరప్ప మాట్లాడుతూ శస్త్రచికిత్స అనంతరం నిర్వహించిన పరీక్షల్లో కణితి పూర్తిగా తొలగిపోయినట్లు నిర్ధారణ అయిందని అన్నారు. రోగి ఎటువంటి న్యూరోలాజికల్ సమస్యలు లేకుండా కోలుకొని స్థిరమైన ఆరోగ్య పరిస్థితిలో డిశ్చార్జ్ అయ్యారు అని తెలిపారు.ఈ శస్త్రచికిత్సను తెలంగాణ ప్రభుత్వ ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) పథకాల కింద పూర్తిగా ఉచితంగా నిర్వహించారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇదే చికిత్సకు సుమారు రూ.10 నుండి రూ.15 లక్షల వరకు ఖర్చవుతుందని తెలిపారు.

ఈ సందర్భంగా న్యూరోసర్జరీ విభాగ అదనపు ప్రొఫెసర్ డా. యర్రగుంట తిరుమల్ మాట్లాడుతూ, ఎండోస్కోపిక్ ట్రాన్స్‌ఆర్బిటల్ అప్రోచ్ మెదడు కణితుల చికిత్సలో విప్లవాత్మక మార్పు అని అన్నారు. కంటి గవ్వ సహజ మార్గాన్ని ఉపయోగించడం వల్ల పెద్ద గాయాలు లేకుండా అత్యుత్తమ ఫలితాలు సాధించవచ్చు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో రోగులకు మరింత సురక్షితమైన చికిత్స అందిస్తున్నామని తెలిపారు.

ఈ  సర్జరీ విజయవంతంగా పూర్తి చేసిన న్యూరోసర్జరీ బృందం హెచ్.ఓ.డి డా.వై.వంశీకృష్ణ, డా. యర్రగుంట తిరుమల్, డా. రామ్‌నాథ్ రెడ్డి, డా. మురళీకృష్ణ, డా. ఉమా మహేశ్వర్, అనస్థీషియా బృందం డా. శ్రీలత, డా. స్వప్నలత ను డైరెక్టర్ అభినందించారు. అలాగే ఈ శస్త్రచికిత్స పూర్తి ఉచితంగా నిర్వహించడానికి  సహకరించిన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. 

దేశంలోని ప్రముఖ న్యూరోసర్జరీ కేంద్రాలలో ఒక టైన నిమ్స్‌లో ప్రతి సంవత్సరం 3,500కు పైగా మెదడు, వెన్నెముక శస్త్రచికిత్సలు నిర్వహించబడుతున్నాయి. ఈ అరుదైన శస్త్రచికిత్స విజయవంతం కావడం ద్వారా నిమ్స్ అత్యాధునిక న్యూరోసర్జరీ సేవలందిస్తున్న అగ్రగామి ప్రభుత్వ వైద్య సంస్థగా మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది.