- రూ.4 లక్షల కోట్లు ఇన్వెస్ట్‌చేయనున్న అమెజాన్
- ఎయిర్ ట్రంక్ నుంచిరూ. 2.50 లక్షల కోట్లు
- రూ.1.25 లక్షల కోట్లు ఖర్చు చేయనున్న గూగుల్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఆర్థిక, రాజకీయపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ, గ్లోబల్ కంపెనీలు భారతదేశంలో అవకాశాలపై సానుకూలంగా ఉన్నాయి. ఇవి గత కొన్ని నెలల్లోనే 90 బిలియన్ డాలర్ల (రూ. 7.50 లక్షల కోట్లు)కుపైగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి.
సరఫరా గొలుసులను బలోపేతం చేయడానికి, అధిక వృద్ధిని సాధించడానికి ఇండియా కీలక కేంద్రంగా మారింది. అమెజాన్ తన మొత్తం పెట్టుబడిని 2030 నాటికి రూ. నాలుగు లక్షల కోట్లకు పెంచనున్నట్లు ప్రకటించింది. ఈ నిధులు క్లౌడ్ మౌలిక సదుపాయాలు, ఏఐ, డిజిటల్ సేవలను అభివృద్ధి చేయడానికి ఉపయోగపడతాయి.
ఆస్ట్రేలియాకు చెందిన డేటా సెంటర్ ఆపరేటర్ ఎయిర్ ట్రంక్ రూ. 2.50 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో 5 గిగావాట్ల డేటా సెంటర్లను నిర్మించనుంది. గూగుల్ తన ఏఐ మౌలిక సదుపాయాలు, సముద్ర గర్భ కనెక్టివిటీ, క్లౌడ్ సామర్థ్యం కోసం ఐదేళ్లలో రూ. 1.25 లక్షల కోట్లు ఖర్చు చేస్తామని వెల్లడించింది. ఫ్రాన్స్‌కు చెందిన భవన నిర్మాణ సామగ్రి తయారీ సంస్థ సెయింట్ గోబైన్ రాబోయే ఐదేళ్లలో రూ. 9,500 కోట్లు పెట్టుబడి పెట్టనుంది.
కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డ్, కంట్రోల్ ఎస్ డేటా సెంటర్స్‌తో కలిసి హైపర్ స్కేల్ డేటా సెంటర్‌కు నిధులు సమకూర్చింది. ఇండస్ట్రియల్ టెక్నాలజీ కంపెనీ ఏబీబీ రూ. 625 కోట్లు పెట్టుబడితో తయారీ రంగాన్ని విస్తరిస్తోంది. భారతదేశంలో భారీ మార్కెట్ ఉండటం, బలమైన డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, మెరుగైన మౌలిక సదుపాయాలు విదేశీ కంపెనీలను పెద్ద ఎత్తున ఆకర్షిస్తున్నాయి.
