నారపల్లిలో విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి చెరువులో దూకిన తల్లి

నారపల్లిలో విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి చెరువులో దూకిన తల్లి

హైదరాబాద్: నగర శివారు మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ముగ్గురు పిల్లలతో కలిసి ఓ మహిళ చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో తల్లి, ఓ కూతురు చనిపోగా.. మిగిలిన ఇద్దరు చిన్నారులు ప్రాణాలతో బయటపడ్డారు. పిల్లలతో కలిసి మహిళ చెరువులోకి దూకడం గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికులతో కలిసి సహయక చర్యలు చేపట్టారు. అప్పటికే తల్లి, ఓ కూతురు మరణించగా.. మిగిలిన ఇద్దరు పిల్లలను రక్షించారు. 

మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతురాలిని చెంగిచర్ల మహాలక్ష్మీ పురం వాసిగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి  తరలించారు. ఆర్ధిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమని మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. ఆత్మహత్యకు ఆర్ధిక ఇబ్బందులేనా..? మరేదైనా కారణం ఉందా..? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.