చైన్ స్నాచింగ్కు మహిళ యత్నం.. సిద్దిపేటజిల్లా దుబ్బాకలో ఆడదొంగను పట్టుకున్న స్థానికులు

చైన్ స్నాచింగ్కు మహిళ యత్నం.. సిద్దిపేటజిల్లా దుబ్బాకలో ఆడదొంగను పట్టుకున్న స్థానికులు
  •  పోలీసులకు అప్పగింత

తొగుట(దుబ్బాక), వెలుగు: ఒంటరిగా వెళ్తున్న వృద్ధురాలి మెడలోని బంగారు పుస్తెలతాడును లాక్కొని పారిపోవడానికి యత్నించిన మహిళా దొంగను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన దుబ్బాక పట్టణంలో బుధవారం ఉదయం జరిగింది. దుబ్బాక ఎస్సై కీర్తిరాజు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్ధిపేటకు చెందిన వీరబత్తిని లక్ష్మి(80) తన కొడుకు మహేశ్​ను చూసేందుకు దుబ్బాకకు వచ్చింది. 

బస్టాండ్‌‌‌‌ నుంచి 15వ వార్డులోని కొడుకు ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా, గాంధీ విగ్రహం సమీపంలోని హనుమాన్ ఆలయం వద్ద వెనుక నుంచి వచ్చిన రామక్కపేటకు చెందిన సిద్దుల రాజమణి ఆమె మెడలోని రెండు తులాల బంగారు పుస్తెలతాడును తెంచుకుని పారిపోవడానికి ప్రయత్నించింది. 

వృద్ధురాలు గట్టిగా అరవడంతో స్థానికులు అప్రమత్తమై రాజమణిని పట్టుకుని, ఆమె వద్ద నుంచి పుస్తెలతాడును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితురాలిని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌‌‌‌కు తరలించారు.