ములుగు, వెలుగు: ములుగు సమీపంలోని ఓ హోటల్ లో భోజనం చేసి బయటకు రాగానే ఓ యువకుడు కుప్పకూలి చనిపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ దేశాయిపేటకు చెందిన పేరాల నాగ సుక్రు(22) బుధవారం ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప ఆలయానికి స్నేహితురాలితో కలిసి వచ్చాడు.
దైవ దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో ములుగు సమీపంలోని వారాహి హోటల్లో ఇద్దరు భోజనం చేశారు. హోటల్ బయటకు రాగానే సుక్రు కుప్పకూలిపోయాడు. స్థానికులు వెంటనే ములుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. విషయం తెలుసుకున్న ఫుడ్ ఇన్స్పెక్టర్ హోటల్ ను తనిఖీ చేసి యువకుడి మృతికి ఫుడ్ పాయిజన్ కారణమా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.
