హైదరాబాద్ సిటీ హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొహెడలో దారుణం జరిగింది. ప్రేమించిన భార్య.. కన్న బిడ్డను అమ్మేసి, మరొకరిని పెళ్లి చేసుకోవడంతో.. తట్టుకోలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన.. బాధితుడి సెల్పీ వీడియోతో వెలుగులోకి వెచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. కొహెడకు చెందిన గోవర్ధన్, సరిత నాలుగేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. అయితే కొంతకాలంగా వీరి మధ్య విభేదాలు రావడంతో సరిత భర్తకు దూరంగా ఉంటోంది. ఈ క్రమంలోనే ఆమె కన్నబిడ్డ అని కూడా చూడకుండా.. ఆ పసివాడిని వేరే వారికి అమ్మేసింది. అంతేకాకుండా భర్తకు తెలియకుండా మరొకరిని వివాహం చేసుకుంది.
తమ ప్రేమకు సాక్ష్యమైన బిడ్డను అమ్మేసి, తనను మోసం చేసి మరో పెళ్లి చేసుకోవడంతో గోవర్ధన్ తన ఆవేదనను ఎవరికీ చెప్పుకోలేక.. తన చావుకు గల కారణాలను వివరిస్తూ ఓ సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి ఆత్మహత్య చేసుకున్నాడు. మోసం చేసిన తన భార్యను వదిలిపెట్టొద్దని తల్లిదండ్రులకు సూచించాడు గోవర్ధన్.
నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గోవర్ధన్ సెల్ఫీ వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రేమించిన భార్య చేసిన దారుణానికి ఒక నిండు ప్రాణం బలైపోవడం స్థానికంగా కలకలం రేపుతోంది. ప్రస్తుతం పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు.
