దళిత యువతిపై రేప్‌..డెడ్‌బాడీపై పెట్రోల్​పోసి నిప్పు..

దళిత యువతిపై రేప్‌..డెడ్‌బాడీపై పెట్రోల్​పోసి నిప్పు..
  • వనపర్తి జిల్లా ఆత్మకూరులో దారుణం
  • ఆరు రోజుల తర్వాత వెలుగులోకి..
  • పోలీసుల అదుపులో నిందితుడు శ్రీనివాస్​

ఆత్మకూరు, వెలుగు: రాత్రి వేళ ఒంటరిగా ఉన్న ఓ దళిత యువతిని నమ్మించిండు. ఇంటి దగ్గర దించుతానని చెప్పి పత్తి చేనులోకి లాక్కెళ్లిండు. రేప్ చేసి చంపేసిండు. పెట్రోల్ పోసి నిప్పు పెట్టిండు. ఏమీ ఎరగనట్లు వెళ్లిపోయిండు. కానీ సీసీకెమెరాల ద్వారా పోలీసులకు చిక్కిండు. వనపర్తి జిల్లా ఆత్మకూరులో ఆరు రోజుల కిందట జరిగిందీ దారుణం. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను ఆత్మకూరు పోలీసులు వెల్లడించారు.

ఇంటికి వెళ్లేందుకు ఎదురుచూస్తుండగా..

ఆత్మకూరు శివారు ఖానాపురానికి చెందిన దళిత యువతి (22) ఇంటర్‌‌ వరకు చదివింది. చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు. తల్లి అనారోగ్యానికి గురికావటంతో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. దీంతో చదువు మానేసి హైదరాబాద్ లోని ఓ షాపింగ్ మాల్ లో ఆమె పని చేస్తోంది. ఈ నెల 6న(శుక్రవారం) హైదరాబాద్ నుంచి ఆర్టీసీ బస్సులో సొంతూరుకు బయల్దేరింది. రాత్రికి ఆత్మకూరు చేరుకుంది. ఫ్యామిలీకి ఫోన్ చేసి తనను ఇంటికి తీసుకెళ్లేందుకు ఎవరినైనా పంపాలని కోరింది. ఇంతలోనే బైక్ పై అక్కడికి ఆత్మకూర్‌‌లోని ఓ మెడికల్ షాప్‌‌‌‌లో పని చేసే శ్రీనివాస్ వచ్చాడు. ఆమెను ఖానాపూర్ లో వదిలి వస్తానని చెప్పి బైక్‌‌ ఎక్కించుకున్నాడు. శ్రీనివాస్ ఆమెను మరో మార్గంలో అల్లీపూర్ మీదుగా తీసుకెళ్లాడు. అమరచింత దగ్గర్లోని పత్తి చేనులోకి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. తర్వాత గొంతు నులిమి హత్య చేశాడు. బైక్ లో పెట్రోల్ తీసి డెడ్​బాడీపై పోసి తగలబెట్టాడు.

యువతి సెల్​ఫోన్​లో మెసేజ్​లు చేస్తూ..

యువతిని హత్య చేసిన తర్వాత శ్రీనివాస్‌‌‌‌ ఆమె మొబైల్ తీసుకెళ్లాడు. ‘‘నాకు అత్యవసరం ఉండి మళ్లీ హైదరాబాద్ వచ్చేశా’’ అని యువతి కుటుంబ సభ్యులకు మెసేజ్ పెట్టి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. అప్పుడప్పుడు యువతి పేరుతో మెసేజ్ లు చేస్తూ 6 రోజులు గడిపాడు. ఈ క్రమంలో తన పొలంలో సగం కాలిపోయిన శవం ఉందని కౌలు రైతు కథలప్ప బుధవారం పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో వనపర్తి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. దగ్గరలోని పోలీస్ స్టేషన్లలో మిస్సింగ్ కేసులపై ఆరా తీయగా ఖానాపూర్ కు చెందిన ఓ యువతి కనిపించడం లేదంటూ గ్రామానికి చెందిన కొందరు పోలీసులకు చెప్పారు.

సీసీటీవీ ఫుటేజీతో దొరికిండు

యువతి నంబర్ కు పోలీసులు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో ఆమె పనిచేస్తున్న షాప్ యజమానికి ఫోన్ చేశారు. గత శుక్రవారం నుంచి ఆమె డ్యూటీకి రావడం లేదని ఓనర్ చెప్పాడు. టవర్ ఆధారంగా యువతి ఫోన్ ఆత్మకూరు పరిధిలోనే ఫోన్ ఉన్నట్లు గుర్తించారు. 6న రాత్రి 9 గంటలప్పుడు యువతిని శ్రీనివాస్ బైక్ పై ఎక్కించుకున్నట్లు సీసీ కెమెరాలో రికార్డయింది. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని బాధితురాలి ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. కేసులో శ్రీనివాస్ తో పాటు ఇంకెవరైనా ఉన్నారా అని దర్యాప్తు చేస్తున్నారు. శుక్రవారం రాత్రి 9 గంటల తర్వాత యువతి కనిపించకుండా పోగా.. అదే రోజు అర్ధరాత్రి రేప్, హత్య జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. కాగా, శ్రీనివాస్‌‌కు రెండు నెలల క్రితమే పెండ్లయినట్టు పోలీసుల విచారణలో తెలిసింది.