హయత్ నగర్ లో కిడ్నాప్ అయిన యువతి సేఫ్…

హయత్ నగర్ లో కిడ్నాప్ అయిన యువతి సేఫ్…

వారం రోజుల క్రితం హైదరాబాద్ ఇబ్రహీంపట్నం మండలం బొంగుళూరు గ్రామంలో కిడ్నాప్ కు గురైన యువతిని  క్షేమంగా ఇంటికి చేరింది. యువతి ఇంటికి చేరిన విషయాన్ని పోలీసులకు తెలియజేశారు తల్లిదండ్రులు. దీంతో యువతిని సరూర్ నగర్ లోని రాచకొండ SOT సీసీఎస్ బిల్డింగ్ లో విచారణ జరుపుతున్నారు పోలీసులు. రవిశేఖర్ గురించి మరిన్ని వివరాలు ఆరా తీస్తున్నారు.

కిడ్నాప్ అనంతరం పోలీసుల నుంచి ఉచ్చు బిగుస్తుండటంతో…యువతిని అద్దంకిలో హైదరాబాద్ బస్ ఎక్కించాడు కిడ్నాపర్ రవిశేఖర్. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి…కారులో ఎత్తుకెళ్లాడు రవిశేఖర్. అప్పటి నుంచి కిడ్నాపర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. హైదరాబాద్ లో కిడ్నాప్ తర్వాత యువతిని.. కడప జిల్లా ఒంటిమిట్ట, తిరుపతి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. పోలీసులు విచారణ స్పీడప్ చేయటంతో అద్దంకిలో వదిలి వెళ్లినట్లు సమాచారం. అద్దంకి నుంచి తెల్లవారుజామున ఎంజీబీఎస్ చేరుకున్న యువతికి….. బస్టాండులో తన చిన్ననాటి స్నేహితురాలు కలవటంతో.. తల్లిదండ్రులకు ఫోన్ చేసింది. స్నేహితురాలితో సహా క్షేమంగా తల్లిదండ్రుల చెంతకు చేరింది.

యువతిని కిడ్నాప్ చేసిన నిందితుడు రవిశేకర్ పలు కేసుల్లో నిందితుడు. అతనిపై అనేక దొంగతనాల కేసులున్నాయి. ఏపీలో చాలాసార్లు పట్టుబడి జైలుకు కూడా వెళ్ళినట్లు పోలీసులు చెబుతున్నారు. ఆంధ్రా, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అనేక దొంగతనాలు చేశాడు. ఒక్క ఏపీలోనే రవిశేఖర్  25 నేరాలు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. దీంతో రవిశేఖర్ ఆచూకీ తెలిపితే లక్ష రూపాయలు రివార్డు ఇస్తామని ఇప్పటికే ప్రకటించారు పోలీసులు. వారం రోజులుగా బృందాలుగా విడిపోయి ఆంధ్రా – తమిళనాడు, ఆంధ్రా – కర్ణాటక సరిహద్దుల్లో గాలింపు చేపట్టారు.  అయితే యువతి ఇంటికి చేరటంతో అంతా రిలాక్సయ్యారు.