కూతుళ్ల చదువుకు పైసలివ్వనన్న తండ్రి.. రూ.46 లక్షలు కట్టాల్సిందేనని కోర్టు కీలక తీర్పు

కూతుళ్ల చదువుకు పైసలివ్వనన్న తండ్రి.. రూ.46 లక్షలు కట్టాల్సిందేనని కోర్టు కీలక తీర్పు

భోపాల్: కుమార్తెల ఉన్నత చదువులకు ఫీజు కట్టేందుకు నిరాకరించిన ఓ తండ్రికి మధ్యప్రదేశ్ హైకోర్టు షాకిచ్చింది. పిల్లలకు విద్యను అందించడం తండ్రి బాధ్యత అని.. ఇద్దరు కూతుర్ల ఉన్నత చదువుల కోసం రూ.46 లక్షలు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. మహిళా సాధికారత కేవలం కాగితాలకే పరిమితం కాకూడదని ఈ సందర్భంగా న్యాయస్థానం పేర్కొంది. తండ్రికి తగినంత ఆదాయం ఉన్నప్పుడు కుమార్తెలకు విద్యావకాశాలు దూరం చేయకూడదని కోర్టు స్పష్టం చేసింది. 

అసలేం జరిగిందంటే..?

మధ్యప్రదేశ్ కు చెందిన ఓ వ్యక్తికి ఒక మహిళతో వివాహమైంది. వీరికి ఇద్దరు కూతుర్లు. వ్యక్తిగత కారణాలతో భార్యభర్తలు విడిపోయారు. ఇద్దరు కూతుర్లు తల్లి దగ్గరే ఉంటున్నారు. తల్లికి నెలకు రూ. 6 వేలు, ఇద్దరు కుమార్తెలకు చెరో రూ. 3 వేల చొప్పున భరణం చెల్లించాలని ఫ్యామిలీ కోర్టు ఆదేశించింది. ఫ్యామిలీ కోర్టు తీర్పును సదరు మహిళ మధ్యప్రదేశ్ హైకోర్టులో సవాల్ చేసింది. ఈ భరణం తమకు సరిపోదని..  కుమార్తెల ఉన్నత విద్యకు అవసరమైన ఖర్చులను ఫ్యామిలీ కోర్టు పరిగణలోకి తీసుకోలేదని పేర్కొంది. 

తల్లికి నెలకు రూ.1 లక్ష, కుమార్తెలకు ఒక్కొక్కరికి నెలకు రూ. 50,000 చొప్పున.. అలాగే విద్యా ఖర్చుల కోసం వేర్వేరుగా చెల్లించాలని కోరారు. ఈ పిటిషన్‎పై జస్టిస్ గజేంద్ర సింగ్ విచారణ చేపట్టారు. విచారణ సందర్భంగా పెద్ద కుమార్తె వైద్య విద్య (MD) కోర్సులో.. చిన్న కుమార్తె మణిపాల్ యూనివర్సిటీలో బి.టెక్ (B.Tech) కోర్సులో ప్రవేశం పొందినట్లు న్యాయస్థానం గుర్తించింది. ఇదిలా ఉంటే, తన దగ్గర అంత డబ్బు లేదని తండ్రి వాదించాడు.

►ALSO READ | ఇంటిపైన ఉన్న వాటర్ ట్యాంకులో 27 పాములు.. ఇన్నాళ్లు ఆ నీళ్లు ఎలా తాగారో దేవడా..!

 అయితే, 2016-17 సంవత్సరానికి గాను అతని సొంత బ్యాలెన్స్ షీట్ ప్రకారం రూ. 17,18,000 ఆదాయం ఉన్నట్లు న్యాయస్థానం గుర్తించింది. అలాగే తండ్రి కొన్ని కంపెనీలు కూడా నడుపుతున్నట్లు కోర్టు గుర్తించింది. వీటన్నింటిని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం.. కుమార్తెల ఉన్నత చదువుల కోసం ఫీజు చెల్లించే అంతా ఆర్థిక స్థోమత ఉందని నిర్ధారించింది. 

దీంతో పెద్ద కుమార్తె వైద్య విద్యకు రూ. 26,69,600 చిన్న కుమార్తె బి.టెక్ ఖర్చులకు రూ. 19,56,600 కలిపి మొత్తం రూ.46,26,200ను నాలుగు నెలల్లోగా చెల్లించాలని తండ్రిని ఆదేశించింది. నిర్ణీత గడువులోగా చెల్లించకుంటే సంవత్సరానికి 6 శాతం వడ్డీ వర్తిస్తుందని కోర్టు హెచ్చరించింది. 

ఈ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళా సాధికారత అనేది కేవలం మాటల్లో కాకుండా ఆచరణలో చూపించాలని పేర్కొంది. తండ్రికి తగినంత ఆర్థిక సామర్థ్యం ఉన్నప్పుడు.. కుమార్తెల విద్యా ఖర్చులను భరించడం అతని చట్టపరమైన బాధ్యత అని కోర్టు గుర్తుచేసింది.