డెహ్రాడూన్: తాగే నీటిలో కొంచెం దుమ్ము పడిన లేదా ఈగలు, చీమల వంటి కీటకాలు కనిపించిన వెంటనే వాటిని పడబోస్తం. అలాంటిది తాగే నీళ్లలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదుల సంఖ్యలో పాములు ఉంటే.. నోట్ల నుంచి మాట కూడా రాదు. వామ్మో ఇన్ని రోజులు మనం తాగింది ఈ నీళ్లా అని గుండె ఆగినంత పని అయితుంది. సరిగ్గా ఇలాంటి ఘటనే ఉత్తరఖాండ్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ పరిధిలో ఉన్న సరాయ్ గ్రామంలోని ఓ ఇంటి మంచి నీటి ట్యాంకులో 27 పాములు ప్రత్యక్షం అవ్వడం తీవ్ర కలకలం రేపింది. వినడానికే ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం..
హరిద్వార్ పరిధిలో ఉన్న సరాయ్ గ్రామంలోని ఓ ఇంట్లో నల్లా నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో సదరు కుటుంబ సభ్యులు సమస్య ఏంటా అని వాటర్ ట్యాంకును తెరిచి చూడగా.. ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం వెలుగుచూసింది. వాటర్ ట్యాంకులో ఏకంగా 27 పాము పిల్లలు ప్రత్యక్షమయ్యాయి. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన కుటుంబ సభ్యులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
►ALSO READ | బిర్యానీలో ఈగ.. హోటల్ పై జరిమానాతో పాటు 10 ప్లేట్ల బిర్యానీ ఫ్రీగా ఇవ్వమన్న కోర్టు
వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు స్నేక్ క్యాచర్లను రంగంలోకి దించారు. వాటర్ ట్యాంకులో ఉన్న మొత్తం 27 పాము పిల్లలను స్నేక్ క్యాచర్లు బయటకు తీసి పునరావాసానికి తరలించారు. వాటర్ ట్యాంకులో ప్రత్యక్షమైన పాము పిల్లలను నీటిలో నివసించే చెక్కర్డ్ కీల్‌బ్యాక్ జాతికి చెందినవని అటవీ అధికారులు గుర్తించారు.
అవి విషపూరితమైనవి కావని తెలిపారు. దీంతో ఆ కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. వాటర్ ట్యాంకులో పాములు ఎలా వచ్చాయనేదానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. వాటర్ ట్యాంకులో ఏకంగా 27 పాములు పిల్లలు ప్రత్యక్షమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇన్నాళ్లు ఆ నీళ్లు ఎలా తాగారో దేవడా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
