యాదగిరిగుట్ట, వెలుగు : బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల నిరంతర ఉచిత కరెంటును అందిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 'ఉత్త కరెంటు' చేసిందని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. సాగునీటితో పాటు విద్యుత్ సరఫరాలోనూ ప్రభుత్వం విఫలమైందన్నారు.
యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం సోలీపేటలోని సబ్‌స్టేషన్‌ను శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా లాగ్ బుక్పరిశీలించి, విద్యుత్ సరఫరా వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ లాగ్ బుక్ ను బట్టి చూస్తే రైతులకు 12 గంటల విద్యుత్ మాత్రమే ఇస్తున్నారని, అందులోనూ రెండు, మూడు సార్లు ట్రిప్అవుతుందన్నారు. ఈ వారం నుంచి 12 గంటలు మాత్రమే సప్లై చేయాలని పైనుంచి ఆదేశాలు వచ్చినట్టు ఆపరేటర్లు చెబుతున్నారన్నారు. వరంగల్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పిన మాటల్లో నిజం లేదని సోలిపేట రికార్డులు నిరూపిస్తున్నాయన్నారు. బీఆర్ఎస్కు పేరు వస్తుందన్న అక్కసుతో భగీరథ స్కీమ్‌ద్వారా ప్రభుత్వం తాగునీటి సరఫరా బంద్ చేసిందని ఆరోపించారు.
బొమ్మలరామారంలో రెండు రోజులకోసారి నల్లానీళ్లు వస్తున్నాయని, సంగారెడ్డి, నారాయణఖేడ్, యాదాద్రి, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో మళ్లీ బిందెలు పట్టుకుని మహిళలు రోడ్ల మీదకు వచ్చే పరిస్థితి వచ్చిందన్నారు. రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలని, మిషన్ భగీరథ ద్వారా ప్రతిరోజూ మంచినీరు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత ఉన్నారు.
