- రెండేండ్ల కింద సీపీఎఫ్, జీపీఎఫ్ సహా రూ.6.90 కోట్లు గోల్‌మాల్
- ముందస్తు బెయిల్ తీసుకున్న 17 మంది బ్యాంకు ఉద్యోగులు
జగిత్యాల, వెలుగు : తెలంగాణ వైద్య విధాన పరిషత్ జగిత్యాల జిల్లాలో ప్రభుత్వ నిధుల గోల్ మాల్ వ్యవహారంలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఉద్యోగుల సీపీఎఫ్, జీపీఎఫ్, డీఏ, సీపీఎస్ ఏరియర్స్, ఇతర డిడక్షన్లకు సంబంధించిన రూ.6.90 కోట్ల నిధుల దుర్వినియోగంపై చేపట్టిన శాఖాపరమైన ఎంక్వైరీ పూర్తి కావడంతో తుది నివేదికను ఉన్నతాధికారులకు అందజేసినట్లు సమాచారం. మరోవైపు పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో బ్యాంకర్ల పాత్రపైనా అనుమానాలు తలెత్తుతున్నాయి. ఉద్యోగుల సంక్షేమ నిధులు దుర్వినియోగంపై ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్‌తో కూడిన బృందం బ్యాంక్ అకౌంట్లు, చెక్కులు, నెఫ్ట్ లావాదేవీలు, నగదు చెల్లింపులు, ఓచర్లు, ఇతర రికార్డులను పరిశీలించి ఈ నెల 7న విచారణ పూర్తి చేసింది. రెండు ఇన్‌ఆపరేటివ్ అకౌంట్లను తిరిగి యాక్టివ్ చేసి వాటి ద్వారా భారీ స్థాయిలో లావాదేవీలు నిర్వహించినట్లు సమాచారం. ఎక్కువగా చెక్కులు, నెఫ్ట్, నగదు రూపంలో లావాదేవీలు జరిగినట్లు, ఈ ఖాతాలను రికార్డ్ అసిస్టెంట్ యాసిన్ వినియోగంలోకి తీసుకొచ్చినట్లు విచారణలో తేలినట్లు సమాచారం. అయితే జిల్లా కార్యాలయం నుంచి అధికారిక అనుమతి లేకుండా ఖాతాలు ఎలా యాక్టివ్ అయ్యాయి ? బ్యాంకు అధికారులు ఎలాంటి ధ్రువీకరణలతో వాటిని అనుమతించారు ? అనే సందేహాలు తలెత్తుతున్నాయి.
ఫోర్జరీ చెక్కులు.. సంతకాలు లేకున్నా చెల్లింపులు
విచారణలో కొన్ని చెక్కులపై మొత్తం మార్పులు చేసిన ఆనవాళ్లు, మరికొన్ని చెక్కులపై సంబంధిత అధికారుల సంతకాలు లేకపోయినా చెల్లింపులు జరిగినట్లు తెలిసింది. జిల్లా అధికారి సంతకాన్ని ఫోర్జరీ చేశారన్న అనుమానంతో ఓ చెక్కును ఫోరెన్సిక్ పరీక్షకు పంపినట్లు తెలిసింది. అప్పటి జిల్లా డీసీఎంఎస్ ఇన్‌చార్జిగా పనిచేసిన అధికారి పర్యవేక్షణలో లోపాలు జరిగాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ముందస్తు బెయిల్ తీసుకున్న 17 మంది బ్యాంకు ఉద్యోగులు
శాఖాపరమైన విచారణ సందర్భంగా బ్యాంకు లావాదేవీల వివరాలు, చెక్కుల కాపీలు, ఖాతాల నిర్వహణకు సంబంధించిన సమాచారం కోరినా సంబంధిత బ్యాంకు అధికారులు సహకరించలేదని తెలిసింది. హెడ్ ఆఫీస్‌కు వివరాలు కోరినా 'అన్ని రికార్డులు పోలీసులకు ఇచ్చాం' అంటూ తప్పించుకున్నట్లు సమాచారం. మరో వైపు 17 మంది బ్యాంకు ఉద్యోగులు ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించినట్లు వెలుగులోకి రావడం పలు అనుమానాలకు తావిస్తోంది.
కీలకంగా మారిన పోలీసుల దర్యాప్తు
శాఖాపరమైన విచారణ అనంతరం సస్పెన్షన్ కు గురైన యాసిన్ నుంచి సుమారు రూ.2 కోట్లు రికవరీ చేసినట్లు సమాచారం. అయితే మొత్తం దుర్వినియోగమైన రూ.6.90 కోట్లలో మిగిలిన నిధులు ఎక్కడికి వెళ్లాయి ? వాటితో ఎలాంటి ఆస్తులు కొనుగోలు చేశారు ? బినామీల పేర్లపై పెట్టుబడులు పెట్టారా ? అనే కోణంలో అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బ్యాంకు ఖాతాల విశ్లేషణ, చెక్కుల ఫోరెన్సిక్ నివేదిక, డిజిటల్ లావాదేవీలు, బినామీ ఆస్తుల గుర్తింపు వంటి అంశాల్లో స్పష్టత వస్తే ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
