కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే అనారోగ్యం బారిన పడ్డారు. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర.. నీట్ పేపర్ లీక్ పై చర్యలు కోరుతూ.. బాధ్యులు అయిన కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ చేస్తూ.. ఆమరణ దీక్ష చేస్తున్నారు. 20 రోజులుగా జంతర్ మంతర్ దగ్గరే దీక్షలో ఉంటున్న అభిజీత్ దీప్కే అనారోగ్యం బారిన పడ్డారు. తీవ్రమైన జ్వరం వచ్చింది. డాక్టర్లు పరీక్షలు చేయగా.. టైఫాయిడ్ అని తేలింది.
టైఫాయిడ్ బారిన పడినా.. దీక్ష కొనసాగిస్తానని.. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు దీక్ష నుంచి కదిలేది తేదని స్పష్టం చేశారు అభిజీత్ దీప్కే.
కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్నాను.. రిపోర్టులు చూస్తే టైఫాయిడ్ అని స్పష్టం అయ్యింది.. డాక్టర్ల సూచనలతో చికిత్స తీసుకుంటున్నాను.. ఇంజెక్షన్స్ ఇస్తున్నారు.. సెలైన్లు ఎక్కిస్తున్నారు.. మందులు వాడుతున్నాను.. త్వరలోనే పూర్తి ఆరోగ్యవంతుడిగా మారతాను అని స్వయంగా ప్రకటించారు కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే.
టైఫాయిడ్ బారిన పడినా.. దీక్ష విరమించేది లేదని.. లక్ష్యం నుంచి పారిపోయే ప్రసక్తి లేదని వెల్లడించారాయన. ఉద్యమాన్ని రోజు రోజుకు విస్తరిస్తున్నా.. ప్రతి ఇంటికి తీసుకెళుతున్న ఉద్యమ, పోరాట యోధులకు అభినందనలు తెలిపారు అభిజీత్ దీప్కే. శాంతియుత నిరసనలతో.. కీలకమైన మూడు డిమాండ్లను త్వరలో సాధిస్తామనే నమ్మకం ఉందని.. దేశ ప్రజలపై విశ్వాసం ఉందన్నారాయన.
ఉద్యమం ఇంత పెద్ద విజయంగా మారటం వెనక.. దేశ యువత, దేశ ప్రజల ఆలోచనలు, వారి కృషి ఉందని.. ఇలాగే నిరసనలు కొనసాగిస్తే.. మంత్రి ధర్మేంద్ర రాజీనామాను సాధించతీరతామనే ధీమా వ్యక్తం చేశారాయన. పోటీ పరీక్షల్లో జవాబుదారీతనం ఉండాలని.. పరీక్షా విధానాల్లో.. ప్రవేశ పరీక్షల్లో సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేశారాయన. 2026, జూన్ 28వ తేదీన ఆందోళన ప్రారంభించిన కాక్రోచ్ జనతా పార్టీ నిరాహార దీక్షలు 26వ తేదీ రోజుకు చేరాయి.
