బిర్యానీలో ఈగ.. హోటల్ పై జరిమానాతో పాటు 10 ప్లేట్ల బిర్యానీ ఫ్రీగా ఇవ్వమన్న కోర్టు

బిర్యానీలో ఈగ.. హోటల్ పై జరిమానాతో పాటు 10 ప్లేట్ల బిర్యానీ ఫ్రీగా ఇవ్వమన్న కోర్టు

బిర్యానీ లవర్స్ కి ఇదొక మైండ్ బ్లోయింగ్ న్యూస్. బిర్యానీలో చచ్చిన ఈగ వస్తే సాధారణంగా హోటల్ యాజమాన్యంతో గొడవపడి, డబ్బులు విసిరేసి వచ్చేస్తాం. కానీ ఒక కస్టమర్ మాత్రం ఏకంగా కోర్టు మెట్లు ఎక్కాడు. దాంతో కంజ్యూమర్ కోర్టు సంచలన తీర్పునిస్తూ.. సదరు హోటల్‌కు జరిమానాతో పాటు బాధితుడికి ఏకంగా 10 ప్లేట్ల వేడివేడి హైదరాబాద్ చికెన్ బిర్యానీని ఫ్రీగా అందించాలని క్రేజీ ఆర్డర్ వేసింది. పుదుచ్చేరిలో జరిగిన ఈ వింత ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

అసలేం జరిగింది?
పుదుచ్చేరిలోని ఎంజీ రోడ్డులో ఉన్న ‘బిర్యానీ & కో’ రెస్టారెంట్‌కు డిసెంబర్ 8, 2025న పి. సుందరకుమార మణికందన్ తన స్నేహితుడు మహమ్మద్ నియాసుద్దీన్‌తో కలిసి బిర్యానీ తినడానికి వెళ్లాడు. ముక్క నోట్లో పెట్టుకుందాం అనుకునే లోపు, ప్లేట్లో చచ్చిపడి ఉన్న ఒక ఈగ కనిపించింది. షాకైన మణికందన్ వెంటనే అలర్ట్ అయ్యి.. హోటల్ సిబ్బంది నిర్లక్ష్యాన్ని, అక్కడ ఉన్న అపరిశుభ్రతను తన ఫోన్లో వీడియోలు, ఫోటోల రూపంలో రికార్డ్ చేశాడు. అది తింటే ఎక్కడ ఆరోగ్యం పాడవుతుందోననే భయం, ఆందోళనతో అతను చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యాడు.

కస్టమర్ నోటీసులకు రెస్టారెంట్ సరిగ్గా స్పందించకపోవడంతో.. మణికందన్ పుదుచ్చేరి జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ను ఆశ్రయించాడు. నిర్లక్ష్యం, మానసిక క్షోభ, కోర్టు ఖర్చుల కింద రూ.లక్షా 30వేలు పరిహారం కావాలని డిమాండ్ చేశాడు. కోర్టు నోటీసులు పంపినా రెస్టారెంట్ యాజమాన్యం విచారణకు హాజరుకాకపోవడంతో కేసు ఏకపక్షంగా సాగింది.

గూగుల్ రివ్యూతో దొరికిపోయిన హోటల్
విచారణలో ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ వెలుగుచూసింది. కస్టమర్ పెట్టిన గూగుల్ రివ్యూకి సమాధానంగా.. "ఇది పొరపాటున జరిగింది, క్షమించండి" అని రెస్టారెంట్ అంగీకరించింది. కానీ లీగల్ నోటీసుకి మాత్రం "తమ తప్పులేదు" అని అబద్ధం చెప్పింది. కోర్టు ఈ లూప్‌హోల్‌ను పట్టుకుంది. కస్టమర్ సమర్పించిన వీడియో ఆధారాలను పరిశీలించిన ధర్మాసనం.. ఆహార భద్రతలో లోపాలు ఉన్నాయని తేల్చింది.

ALSO READ : స్టేట్ బ్యాంక్ కంటే ఎక్కువ వడ్డీ అందిస్తున్న పోస్టాఫీస్ స్కీమ్..

10 ప్లేట్ల బిర్యానీ ఫ్రీ..
వినియోగదారుల రక్షణ చట్టం-2019 ప్రకారం హోటల్ సేవల్లో లోపం ఉన్నట్లు కోర్టు తీర్పునిచ్చింది. బాధితుడికి జరిగిన మానసిక వేదనకు గానూ రూ.10వేలు పరిహారం, కోర్టు ఖర్చుల కింద మరో రూ.3వేలు చెల్లించాలని ‘బిర్యానీ & కో’ను ఆదేశించింది. ఇక్కడే కోర్టు అసలైన క్రేజీ కండిషన్ పెట్టింది. బాధితుడికి రాబోయే 5 ఆదివారాల పాటు, వారానికి 2 ప్లేట్ల చొప్పున మొత్తం 10 ప్లేట్ల నాణ్యమైన, వేడివేడి 'హైదరాబాద్ చికెన్ బిర్యానీ'ని ఉచితంగా అందించాలని హోటల్‌ను ఆర్డర్ వేసింది. ఈ తీర్పుతో కస్టమర్ల హక్కుల విషయంలో నిర్లక్ష్యంగా ఉండే హోటళ్లకు గట్టి వార్నింగ్ ఇచ్చినట్లయింది.