స్టేట్ బ్యాంక్ కంటే ఎక్కువ వడ్డీ అందిస్తున్న పోస్టాఫీస్ స్కీమ్.. ఎంత లాభం వస్తుంది?

స్టేట్ బ్యాంక్ కంటే ఎక్కువ వడ్డీ అందిస్తున్న పోస్టాఫీస్ స్కీమ్.. ఎంత లాభం వస్తుంది?

ప్రస్తుతం స్టాక్ మార్కెట్, బంగారం ధరల్లో తీవ్రమైన ఒడిదుడుకులు కొనసాగుతున్నాయి. ఇలాంటి అస్థిరమైన సమయాల్లో మధ్యతరగతి ఇన్వెస్టర్లకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు సురక్షితమైన ప్రత్యామ్నాయాలుగా నిలుస్తాయి. ప్రతి నెలా కొంత మొత్తాన్ని పొదుపు చేస్తూ.. రాబడి పొందాలనుకునే వారికి ఆర్‌డీ బెస్ట్ ఆప్షన్. ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌డీ రేట్లతో పోలిస్తే.. పోస్టాఫీస్ ఆర్‌డీపై ఎక్కువ వడ్డీ లభిస్తోంది. దీర్ఘకాలంలో ఇది ఇన్వెస్టర్లకు మంచి లాభాలను తెచ్చిపెడుతుంది.

వడ్డీ రేట్ల తేడా ఎంత?
ప్రస్తుతం ఎస్‌బీఐ తన ఆర్‌డీ ఖాతాలపై 6.05 శాతం వడ్డీని అందిస్తుండగా.. పోస్టాఫీస్ ఆర్‌డీపై ఏకంగా 6.7 శాతం వడ్డీ లభిస్తోంది. ఒక ఇన్వెస్టర్ ప్రతి నెలా రూ.10వేలు చొప్పున 5 ఏళ్లు ఇన్వెస్ట్ చేస్తే రెండు పథకాల్లోనూ అతను జమ చేసే మొత్తం రూ.6లక్షలు అవుతుంది.

5 ఏళ్ల తర్వాత చేతికి వచ్చేది ఎంత?
పోస్టాఫీస్ RD 6.7 శాతం వడ్డీ రేటు ప్రకారం.. ఐదేళ్ల కాలపరిమితి ముగిసేసరికి ఇన్వెస్టర్‌కు వడ్డీతో కలిపి మొత్తం రూ.7లక్షల 14వేలు లభిస్తాయి. అయితే ఎస్‌బీఐ RD 6.05 శాతం వడ్డీ రేటు ప్రకారం.. ఐదేళ్ల తర్వాత ఇన్వెస్టర్‌కు రూ.7లక్షల 2వేలు మాత్రమే అందుతాయి. కేవలం వడ్డీ రేట్ల వ్యత్యాసం కారణంగానే పోస్టాఫీస్ ఆర్‌డీని ఎంచుకోవడం ద్వారా ఇన్వెస్టర్లకు దాదాపు రూ.12వేల 244 అదనపు లాభం పొందొచ్చు. 

పోస్టాఫీస్ ఆర్‌డీ స్పెషాలిటీ ఏంటి?
పోస్టాఫీస్ ఆర్‌డీని కనీసం రూ.100 తోనే ప్రారంభించవచ్చు. ఇందులో ప్రీ-మెచ్యూర్ విత్‌డ్రాయల్ సదుపాయం 3 ఏళ్ల తర్వాతే అందుబాటులోకి వస్తుంది. ఒకవేళ ఐదేళ్లు నిండకుండానే డబ్బును వెనక్కి తీసుకుంటే.. ఆర్‌డీ వడ్డీకి బదులుగా సాధారణ సేవింగ్స్ ఖాతాకు ఇచ్చే వడ్డీని మాత్రమే చెల్లిస్తారు.

ALSO READ : గ్లోబల్ AI టెక్ స్టాక్స్‌లో వినాశనం.. 

ఎస్‌బీఐలో కూడా ఆర్‌డీని రూ.100 తోనే మొదలుపెట్టవచ్చు. అయితే ఇందులో ఒక కఠినమైన నిబంధన ఉంది. వరుసగా 6 ఇన్‌స్టాల్‌మెంట్లు చెల్లించకపోతే బ్యాంక్ ఆ ఖాతాను క్లోజ్ చేస్తుంది. అంతేకాకుండా వాయిదా చెల్లింపు ఆలస్యమైతే ప్రతి రూ.100 పై రూపాయిన్నర చొప్పున ఎస్‌బీఐ పెనాల్టీ విధిస్తుంది. కాబట్టి మార్కెట్ రిస్క్ లేకుండా స్థిరమైన, ఎక్కువ రాబడిని కోరుకునే ఇన్వెస్టర్లకు ప్రస్తుతానికి పోస్టాఫీస్ ఆర్‌డీనే లాభదాయకమైన ఎంపికగా కనిపిస్తోంది.