గత రెండేళ్లుగా భారత స్టాక్ మార్కెట్ గ్రోత్ ఘోస్ట్ టౌన్ లాగా నిస్సారంగా మారిపోయింది. నిఫ్టీ హెవీవెయిట్ ధురంధరులు సైతం అంతర్జాతీయ ఇన్వెస్టర్ల అమ్మకాల ధాటికి రక్తసిక్తమై పెద్ద గ్రోత్ లేకుండా కొనసాగుతున్నాయి. ఫలితంగా మార్కెట్ ఫ్రస్ట్రేటింగ్ 0% రిటర్న్స్‌తో ఒకే చోట తిరుగుతోంది. అయితే నిజమైన ఛాంపియన్లను ఎక్కువ కాలం అణచిపెట్టలేరు. లెజెండరీ సినిమా డైలాగ్ తరహాలో చెప్పాలంటే.. గాయపడ్డాను కాబట్టే.. మరింత ప్రమాదకరంగా మారాను. ఇప్పుడు మన మార్కెట్ దిగ్గజాల పరిస్థితి కూడా ఇదే. బేర్స్‌కు చుక్కలు చూపిస్తూ.. ఒక భారీ ర్యాలీకి దలాల్ స్ట్రీట్ సిద్ధమవుతోంది.
గ్లోబల్ AI వినాశనం.. ఇండియాకు వరం
ప్రస్తుతం అమెరికా నాస్‌డాక్, సౌత్ కొరియా, తైవాన్ మార్కెట్లలో AI ట్రేడ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారీ టెక్ స్టాక్స్ పతనం కారణంగా గ్లోబల్ మార్కెట్లు అతలాకుతలం అవుతున్నాయి. ఇలాంటి వాతావరణంలో భారతదేశం అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు ఒక ‘యాంటీ-AI’ ట్రేడ్‌గా, ఒక ప్రశాంతమైన ఒయాసిస్సులా కనిపిస్తోందని విశ్లేషకులు చెప్తున్నారు. గ్లోబల్ క్యాపిటల్ ఫ్లోస్ రివర్స్ కావడం వల్ల భారత్ భారీగా లబ్ధి పొందనుందని వారు అంటున్నారు.
చిప్స్ ర్యాలీ టు క్యాపిటల్ ఎగ్జిట్..
గడిచిన కాలంలో తైవాన్, సౌత్ కొరియాల్లో చిప్ తయారీ స్టాక్స్ విపరీతంగా పెరగడంతో.. ఫారిన్ ఇన్వెస్టర్లు భారత స్టాక్ మార్కెట్లను వదిలిపెట్టి అక్కడికి పరుగెత్తారు. 2025లో రూ.లక్షా 66వేల కోట్లు, 2026లో ఇప్పటివరకు సుమారు రూ.2లక్షల 70వేల కోట్ల విలువైన షేర్లను FIIలు దలాల్ స్ట్రీట్‌లో అమ్మేశారు. కొరియా, తైవాన్‌లలో ప్రజలు ఇన్సూరెన్స్ పాలసీలు, పర్సనల్ లోన్లు తీసుకుని మరీ శామ్‌సంగ్, ఎస్‌కే హైనిక్స్ వంటి చిప్ స్టాక్స్ కొన్నారని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ సీఐఓ ఎస్. నరేన్ వెల్లడించారు. ఇది స్పష్టంగా ఒక బబుల్ లాంటి పరిస్థితిని సూచిస్తోందని చెప్పారు. ఇప్పుడు ఆ బుడగ బద్దలయ్యే సంకేతాలు రావడంతో.. ఆ డబ్బు మళ్లీ ఇండియా వైపు రానుందని అభిప్రాయపడ్డారు.
డైవర్సిఫైడ్ పవర్ హౌస్ వర్సెస్ సింగిల్ ప్రొడక్ట్ రిస్క్..
తైవాన్, కొరియా దేశాల మార్కెట్లు కేవలం సెమీకండక్టర్లు, చైనా భౌగోళిక రాజకీయరిస్క్‌లపై ఆధారపడి నడుస్తాయి. కానీ భారతదేశం అలా కాదు. ఇండియా ఒక వైవిధ్యమైన, దేశీయ డిమాండ్ ఆధారిత మార్కెట్ అని బజాజ్ ఫిన్‌సర్వ్ AMC అభిప్రాయపడింది. ఇక్కడ ఫైనాన్షియల్స్, కన్సప్షన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి విభిన్న రంగాలు మార్కెట్‌ను నడిపిస్తాయి. గ్లోబల్ టెక్ సైకిల్స్ మనల్ని అంత సులభంగా దెబ్బతీయలేవని పేర్కొంది.
చౌకగా దొరుకుతున్న నిఫ్టీ.. ఎగబడనున్న బుల్స్
భారత మార్కెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు భారీగా నిధులు ఉపసంహరించుకోవడంతో.. ఇక్కడి వాల్యుయేషన్లు చాలా ఆకర్షణీయంగా మారాయి. ప్రస్తుతం నిఫ్టీ దాని దీర్ఘకాలిక సగటు కంటే దాదాపు 10% డిస్కౌంట్‌లో ట్రేడవుతోందని హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ ఎండి & సీఈఓ ధీరజ్ రెల్లి చెప్పారు. FY27 సెకండ్ హాఫ్‌లో కార్పొరేట్ ఆదాయాలు మరింత పుంజుకోనున్నాయి. యూఎస్-ఇరాన్ వివాదం సర్దుమణిగితే, నిఫ్టీ ఈ ఏడాదిలోనే సరికొత్త రికార్డు గరిష్టాలను తాకడం ఖాయమని అభిప్రాయపడ్డారు.
ఇండియాకు సంబంధించిన అసలైన రీ-రేటింగ్ ఇంకా ముందుందని కార్నెలియన్ అసెట్ మేనేజ్‌మెంట్ వ్యవస్థాపకుడు వికాస్ ఖేమాని అభిప్రాయపడుతున్నారు. గ్లోబల్ టెక్ బూమ్ సమయంలో ఇండియాలో సెమీకండక్టర్ ఎక్స్‌పోజర్ లేకపోవడమే శాపమైతే.. ఆ బూమ్ ముగిసాక, అదే మన మార్కెట్‌కు అతిపెద్ద వరంగా మారబోతోందని చెప్పారు. సో ప్రస్తుతం గ్లోబల్ టెక్ స్టాక్స్ కుప్పకూలటం రానున్న కాలంలో భారత స్టాక్ మార్కెట్లలో బుల్ జోరుకు సంకేతంగా మార్కెట్ నిపుణులు అభివర్ణిస్తున్నారు.
