E20 పెట్రోల్ పై వెనక్కి తగ్గేది లేదు : తేల్చి చెప్పేసిన కేంద్రం

E20 పెట్రోల్ పై వెనక్కి తగ్గేది లేదు : తేల్చి చెప్పేసిన కేంద్రం

పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం వల్ల ఇంజిన్లు దెబ్బతింటాయనే పుకార్లపై  కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. E20 పెట్రోల్ అత్యంత సురక్షితమైన, స్వచ్ఛమైన, ఆధునిక ఇంధనమని.. దీన్ని మళ్లీ పాత పద్ధతికి మార్చే ప్రతిపాదన ఏదీ లేదని పార్లమెంటు వేదికగా స్పష్టం చేసింది. కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి ఈ విషయాన్నీ స్వయంగా వెల్లడించారు. భారతదేశం నిర్దేశించుకున్న 20 శాతం ఇథనాల్ మిశ్రమ లక్ష్యాన్ని గడువు కంటే ఐదేళ్ల ముందే సాధించామని ప్రభుత్వం తెలిపింది. 2022-23లో సగటు ఇథనాల్ మిశ్రమం 12% ఉండగా.. 2023-24 నాటికి అది 14.6%కి, 2024-25 నాటికి 19.2%కి పెరిగింది. ప్రస్తుత 2025-26 నాటికి ఇది 20%కి చేరుకుంది.

ఇంజిన్లు పాడవుతాయనేది అపోహ 
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి వ్యతిరేకంగా E20 పెట్రోల్ వల్ల ఇంజిన్లు దెబ్బతినడం, అరిగిపోవడం జరగదని చాల  పరీక్షల్లో తేలిందని ప్రభుత్వం స్పష్టం చేసింది. నీతి ఆయోగ్, ఇతర సంస్థల పరిశోధనల్లో ఈ విషయం కూడా రుజువైంది. E20 సర్టిఫికేషన్ లేని పాత వాహనాలకు సైతం సర్వీసింగ్ చేసిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ.. ఇథనాల్ వల్ల ఇంజిన్ ఫెయిల్ అయినట్లు ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని స్పష్టం చేసింది. ప్రముఖ ద్విచక్ర వాహన కంపెనీల నుంచి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తమైంది.

ప్రస్తుతం దేశంలో 2 కోట్లకి పైగా ద్విచక్ర వాహనాలు, 3 కోట్ల పైగా కార్లు ఎలాంటి సమస్యలు లేకుండా E15, E20 పెట్రోల్‌తోనే నడుస్తున్నాయి.

మైలేజీ తగ్గుతుందా
డ్రైవింగ్ చేసే విధానం, రోడ్ల పరిస్థితి, వాహన మెయింటెనెన్స్ బట్టి మైలేజీ ఆధారపడి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. అయితే కేవలం E10 కోసం తయారైన వాహనాల్లో E20 వాడినప్పుడు 3 నుంచి 5 శాతం వరకు మైలేజీ స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది. అదే సమయంలో E20లో ఉండే అధిక ఆక్టేన్ వల్ల వాహనం పికప్, ప్రయాణ నాణ్యత, ఇంజిన్ పనితీరు మాత్రం మెరుగవుతాయని వెల్లడించింది.

దేశానికి భారీగా లాభాలు
ఇథనాల్ మిశ్రమంతో దేశానికి ఆర్థికంగా, పర్యావరణపరంగా ఎంతో మేలు జరిగిందని కేంద్రం వివరించింది. దాదాపు రూ. 2 లక్షల కోట్ల విదేశీ మారకద్రవ్యం ఆదా అయింది. 316 లక్షల మెట్రిక్ టన్నుల ముడి చమురు దిగుమతులు తగ్గాయి. పర్యావరణానికి హాని చేసే 952 లక్షల మెట్రిక్ టన్నుల కార్బన్ ఉద్గారాలు తగ్గాయి. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు రూ. 1.66 లక్షల కోట్లకు పైగా చెల్లింపులు అందాయి.

►ALSO READ | కాక్రోచ్ జనతా పార్టీకి.. విదేశీ నిధులు అందుతున్నాయా అని అడిగితే.. కేంద్రం ఏం చెప్పిందంటే..

సమస్యలు వస్తే ఎక్కడ ఫిర్యాదు చేయాలంటే 
E20 ఇంధనానికి సంబంధించి ఏవైనా సందేహాలు లేదా ఫిర్యాదులు ఉంటే వినియోగదారులు నేరుగా సంప్రదించవచ్చని చమురు కంపెనీలు తెలిపాయి. పెట్రోల్ బంకుల్లోని ఫిర్యాదుల రిజిస్టర్లు, టోల్-ఫ్రీ నంబర్లు, కంపెనీ వెబ్‌సైట్లు, మొబైల్ యాప్‌లు ఇంకా  సోషల్ మీడియా  ద్వారా ఫిర్యాదులు చేయవచ్చు. వచ్చిన ఫిర్యాదులపై  విచారణ జరిపి సరైన పరిష్కారం చూపుతామని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.