జూపార్కులో వరద సమస్యకు శాశ్వత పరిష్కారం : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ టి.వెంకన్న

జూపార్కులో వరద సమస్యకు శాశ్వత పరిష్కారం :  గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ టి.వెంకన్న

వరంగల్‍, వెలుగు: ఓరుగల్లు కాకతీయ జూపార్కులో వరద, కాలనీల మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ టి.వెంకన్న తెలిపారు. హనుమకొండ హంటర్ రోడ్డులో ఈ పార్కు లోతట్టు ప్రాంతంలో ఉండటంతో సుమారు 25 కాలనీల మురుగునీరు జూపార్కులోకి చేరుతుండగా, పర్యాటకులు కూడా దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారు. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి చొరవతో రూ.కోటితో డ్రైనేజీ నిర్మాణం ప్రారంభించినా, పనులు సగంలోనే నిలిచిపోయాయి. 

దీంతో మురుగునీరు నిల్వ ఉండి కాలుష్యం మరింత పెరిగింది. కాలుష్య ప్రభావంతో గతంలో రెండు పులులను ఇతర ప్రాంతాలకు తరలించగా, ఒక తెల్లపులి అనారోగ్యంతో మృతి చెందింది. మరికొన్ని జంతువులు కూడా అనారోగ్యానికి గురయ్యాయి. ఈ సమస్యపై ‘వీ6, వెలుగు’ ప్రచురించిన కథనానికి స్పందించిన జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి.వెంకన్న శుక్రవారం అటవీశాఖ అధికారి ముకుందరెడ్డి, జూపార్క్ అసిస్టెంట్ క్యూరేటర్ మయూరితో కలిసి జూపార్కును పరిశీలించారు. మురుగునీటి నిల్వ ప్రాంతాలు, మధ్యలో ఆగిపోయిన డ్రైనేజీ పనులను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమస్యపై శాస్త్రీయ అధ్యయనం చేసి శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.