- విద్యార్థులపై దాడికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్
- కేంద్ర మంత్రులు నడ్డా, జితేంద్ర సింగ్‌తో సీజేపీ ప్రతినిధుల చర్చలు
- నేడు మరోసారి సమావేశం
- మంత్రి రాజీనామాపై కేంద్రం ఒక రోజు టైమ్ కోరిందన్న సీజేపీ
న్యూఢిల్లీ: కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ విషయంలో ఎలాంటి రాజీపడే ప్రసక్తే లేదని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) శుక్రవారం కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో పోలీసుల చేతిలో తీవ్రమైన దాడికి గురైన విద్యార్థులకు కేంద్రం బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. మే 3న నీట్ పరీక్ష రద్దు తర్వాత ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ. కోటి నష్టపరిహారం ఇవ్వాలని కోరింది.
శుక్రవారం ఢిల్లీలోని విఠల్‌భాయ్ పటేల్ హౌస్‌లో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లతో సీజేపీ అధికార ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా దాదాపు రెండు గంటల పాటు చర్చలు జరిపారు. నీట్ పేపర్ లీక్, పరీక్షల వ్యవస్థలోని ఇతర అక్రమాలపై తీసుకోబోయే చర్యలు, నిరసనలను ముగించే అంశంపైనే ప్రధానంగా చర్చించారు. సీజేపీ ప్రతినిధుల డిమాండ్లను తాము తెలుసుకున్నామని, త్వరలోనే వారికి సమాధానం ఇస్తామని ఈ సమావేశం అనంతరం నడ్డా తెలిపారు.
సీజేపీ ప్రతినిధులతో శనివారం మరోసారి సమావేశం కానున్నట్టు చెప్పారు. కేంద్ర మంత్రులతో సమావేశం తర్వాత సౌరవ్ దాస్ మీడియాతో మాట్లాడారు. ‘‘ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ విషయంలో ఎలాంటి రాజీ లేదని మేం కేంద్ర మంత్రులకు చెప్పాం. రాజీనామా డిమాండ్‌పై శనివారం మధ్యాహ్నం వరకు వారు సమయం కోరారు” అని తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.కోటి పరిహారంతో పాటు, నిరసనకారులపై నమోదైన ఎఫ్ఐఆర్‌లను ఉపసంహరించుకోవాలని కూడా డిమాండ్ చేశామన్నారు.
కాగా, తమ డిమాండ్లతో కేంద్ర ప్రభుత్వానికి సీజేపీ లేఖ కూడా రాసింది. ‘‘విద్యార్థులకు నష్టపరిహారం, ఎఫ్‌ఐఆర్‌ల ఉపసంహరణతోపాటు భద్రతా బలగాల చేతిలో దారుణంగా దెబ్బలు తిన్న విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ చీఫ్, ఢిల్లీ పోలీస్ కమిషనర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాం” అని సీజేపీ వెల్లడించింది. కాగా, సీజేపీ ఆధ్వర్యంలో నిరసనలు ప్రారంభమైన తర్వాత వారితో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపడం ఇది మూడోసారి.
ప్రధాన్‌కు కేబినెట్ అండ.. రాజీనామాకు నో చాన్స్
కేంద్ర మంత్రి మండలి మొత్తం ధర్మేంద్ర ప్రధాన్‌కు అండగా నిలుస్తోందని, ఆయన రాజీనామా చేయాలన్న డిమాండ్‌కు ప్రభుత్వం అంగీకరించే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ‘‘నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)లో ఉన్న సమస్యల జాబితాను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. త్వరలోనే ఈ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం.
పేపర్ లీకేజీలకు పాల్పడుతున్న అనేక ముఠాలను ఇప్పటికే పట్టుకున్నాం. మరిన్ని చర్యలు త్వరలోనే తీసుకోబోతున్నాం’’ అని కేంద్ర ప్రభుత్వంలోని ఓ అధికారి వెల్లడించారు. రాజీనామా అనేది అత్యంత తేలికగా తీసుకునే నిర్ణయమని.. కానీ, తాము ధర్మేంద్ర ప్రధాన్‌కు అండగా నిలుస్తామని కేంద్ర కేబినెట్ మొత్తం స్పష్టం చేసినట్టు తెలిపారు.
