శ్రీమహావిష్ణువు యోగనిద్ర అనేది సాధారణ నిద్ర కాదు, ఇది విశ్వాన్ని నడిపించే ఒక దివ్యమైన యోగ ధ్యాన స్థితి. ఆషాఢ శుద్ధ ఏకాదశి (తొలి ఏకాదశి) నాడు ప్రారంభమై, కార్తీక శుద్ధ ఏకాదశి (ప్రబోధినీ ఏకాదశి) ( జూలై 25- నవంబర్ 20) వరకు ఉండే నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాసంగా పిలుస్తారు. ఈ నాలుగు నెలల పాటు ఎలాంటి ఆచారాలు.. నియమాలు పాటించాలి.. విశిష్టత ప్రాధ్యానం ఏంటి... పూజా ఎలా చేయాలి.. మొదలగు విషయాలను తెలుసుకుందాం. . . !
హిందూ పురాణాల ప్రకారం ఆషాఢమాసం శుద్ద ఏకాదశి ( 2026 జులై 25) నుంచి చాతుర్మాసం ప్రారంభమవుతుంది. పండితులు, పురాణాలు, ఆగమ శాస్త్రాలు తెలిపిన వివరాల ప్రకారం ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఆషాఢ శుక్ల ఏకాదశి రోజున ( జులై 25) శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి ప్రవేశిస్తారని వైష్ణవ సంప్రదాయం చెబుతుంది. ఈ రోజు నుంచి ప్రారంభమయ్యే చాతుర్మాస్యం నాలుగు నెలల పాటు కొనసాగుతుంది. అనంతరం కార్తీక శుక్ల ఏకాదశి( నవంబర్ 20) రోజున వచ్చే ఉత్తాన ఏకాదశి నాడు విష్ణుమూర్తి యోగనిద్ర నుంచి మేల్కొంటారని పండితులు చెబుతున్నారు. ఈ కారణంగానే ఈ ఏకాదశిని దేవశయన ఏకాదశిగా పిలుస్తారు. అలాగే దక్షిణాయనం ప్రారంభమైన తర్వాత వచ్చే తొలి ప్రధాన ఏకాదశి కావడంతో తొలి ఏకాదశి అనే పేరు ప్రసిద్ధి చెందింది.
నాలుగు నెలలు ఇంట్లో ఏం చేయాలి..
చాతుర్మాసం సమయంలో నాలుగు నెలలపాటు శ్రీ మహా విష్ణువు యోగ నిద్రలో ఉన్న కాలంలో బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి ఇంటిని పరిశుభ్రంగా ఉంచి స్నానం చేయాలి. నిత్యం సమయాన్ని బట్టి .. అవకాశాన్ని బట్టి పూజా మందిరాన్ని శుభ్రపరచి లక్ష్మీనారాయణుల చిత్రపటం లేదా శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శ్రీనరసింహస్వామి, శ్రీ వేంకటేశ్వరస్వామి ... విష్ణు స్వరూపాలను పూజించాలి. ప్రదోషకాలంలో అయినా ( సాయంత్రం) పూజ చేయవచ్చు. దేవుడి పటాలను... విగ్రహాలను గంధం, కుంకుమతో తిలకాలు పెట్టి పుష్పాలతో అలంకరించాలి. పచ్చకర్పూరం కలిపి తయారు చేసిన తీపి నైవేద్యాన్ని సమర్పించి దీపారాధన చేయాలి. తులసీదళాలతో అర్చన చేస్తూ “ఓం లక్ష్మీ నారాయణాయ నమః” అనే మంత్రాన్ని 21, 54 లేదా 108 సార్లు జపించడం చాలా మంచిదని పండితులు చెబుతున్నారు. తులసి దళాలు అందుబాటులో లేకపోతే తెల్ల గన్నేరు, నందివర్ధనం, తుమ్మి, జాజి వంటి పుష్పాలతో కూడా విష్ణుమూర్తిని పూజించవచ్చు.
పూజ ముగిసిన తర్వాత పచ్చకర్పూరంతో హారతి ఇవ్వడం వైష్ణవ సంప్రదాయంలో శుభప్రదంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుందని, భక్తికి మరింత బలం చేకూరుతుందని పండితులు చెబుతున్నారు.
ALSO READ : ఆధ్యాత్మికం : కష్టాల్లోనూ సంతోషంగా ఉండటం ఎలా?
ఇంట్లో పూజ అనంతరం సమీపంలోని విష్ణు ఆలయాన్ని దర్శించడం ఉత్తమంగా భావిస్తారు. విష్ణు ఆలయం అందుబాటులో లేకపోతే శ్రీరామ, శ్రీకృష్ణ, శ్రీ వేంకటేశ్వరస్వామి లేదా శ్రీనరసింహస్వామి ఆలయాలను సందర్శించవచ్చు. ఆలయంలో తులసి మాలను సమర్పించి అర్చన చేయించుకోవడం, ధ్వజస్తంభం వద్ద ఆవునెయ్యితో దీపం వెలిగించడం శుభఫలితాలు కలుగుతాయి. ఈ విధంగా చేయడం ద్వారా శ్రీమహావిష్ణువు కటాక్షం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాల ద్వారా తెలుస్తుంది
విష్ణు సహస్రనామ పారాయణం
ఈ నాలుగు నెలలు రోజూ విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయడం అత్యంత పుణ్యప్రదంగా భావిస్తారు. చదవడం రాని వారు భక్తి శ్రద్దలతో విన్నా సరిపోతుంది. దీనివల్ల మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక శక్తి, కుటుంబ సౌఖ్యం కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
