యువతపై మోదీ ప్రభుత్వం అహంకారం: విద్యార్థులను దేశానికి శత్రువులుగా చిత్రీకరిస్తున్నరు

యువతపై మోదీ ప్రభుత్వం అహంకారం: విద్యార్థులను దేశానికి శత్రువులుగా చిత్రీకరిస్తున్నరు
  • జవాబుదారీతనం కోరితే స్టూడెంట్లపై లాఠీఛార్జీలా?
  • కేంద్రంపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ మండిపాటు
  • మోదీ పాలనలో విద్యావ్యవస్థ సంక్షోభంలో పడిందని ఆరోపణ

న్యూఢిల్లీ: విద్యార్థుల పట్ల మోదీ ప్రభుత్వం అహంకారాన్ని ప్రదర్శిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ విమర్శించారు. జవాబుదారీతనం, విద్యా రంగ సంస్కరణల కోసం డిమాండ్ చేస్తున్న స్టూడెంట్ల పట్ల కేంద్ర ప్రభుత్వం అత్యంత క్రూరంగా ప్రవర్తిస్తోందని ఆరోపించారు. యువతను భావి భారత నిర్మాతలుగా చూడకుండా వారిని దేశ శత్రువులుగా చిత్రీకరిస్తోందని మండిపడ్డారు. 

‘ది హిందూ’ పత్రికలో ప్రచురితమైన తన ప్రత్యేక వ్యాసంలో సోనియా గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో విద్యా వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేసిన సోనియా..ప్రశ్నాపత్రాల లీకేజీలు, విద్యా రంగ క్షీణతకు వ్యతిరేకంగా పోరాడుతున్న యువతపై పోలీసులతో దాడులు చేయించడం మోదీ ప్రభుత్వపు నియంత స్వభావానికి నిదర్శనమని మండిపడ్డారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీఛార్జీలు, టియర్ గ్యాస్ ప్రయోగించడం దారుణమని పేర్కొన్నారు.

విద్యావ్యవస్థలో లోపాలున్నాయ్

ఈ సందర్భంగా విద్యా వ్యవస్థలోని మూడు ప్రధాన లోపాలను సోనియా గాంధీ వివరించారు. మొదటిది, ప్రభుత్వ విద్య నుంచి కేంద్రం వెనక్కి తగ్గిందని తెలిపారు. గడిచిన 12 ఏళ్లలో దాదాపు లక్ష ప్రభుత్వ పాఠశాలలను మూసివేసి, 43 వేల ప్రైవేట్ స్కూళ్లకు అనుమతులిచ్చారని విమర్శించారు. బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పాఠశాల విద్యపై కేటాయింపులను 50 శాతం, ఉన్నత విద్యపై 33 శాతం తగ్గించడంతో కుటుంబాలపై ఆర్థిక భారం పెరిగిందన్నారు.

 ఇక రెండో సమస్యగా.. పరీక్షల వ్యవస్థను కేంద్రీకరించి నాశనం చేశారని ఆరోపించారు. ఎన్టీఏ  వంటి అసమర్థ సంస్థల ద్వారా పరీక్షలు నిర్వహించడం వల్ల గత 12 ఏళ్లలో 152 ప్రశ్నాపత్రాల లీకేజీలు జరిగాయని చెప్పారు. మూడో సమస్యగా.. నాణ్యమైన విద్యాబోధన, ఉద్యోగావకాశాలు లేకపోవడాన్ని సోనియా ప్రస్తావించారు. రాజకీయ నియామకాల వల్ల విశ్వవిద్యాలయాల్లో బోధనా ప్రమాణాలు పడిపోయాయని చెప్పారు. విద్యాశాఖను బలోపేతం చేయడానికి పార్లమెంటరీ కమిటీ ఇచ్చిన సూచనలను కూడా కేంద్రప్రభుత్వం పక్కనబెట్టిందని ఫైర్ అయ్యారు. 

మోదీ ప్రభుత్వానికి అసలు జవాబుదారీతనం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును విస్మరించడం విచారకరమని, యువత తమ భవిష్యత్తును కాపాడుకోవడానికి చేస్తున్న పోరాటానికి అండగా నిలవడం మనందరి నైతిక, రాజకీయ, రాజ్యాంగబద్ధమైన బాధ్యత అని సోనియా గాంధీ పేర్కొన్నారు.