భూపాలపల్లి రూరల్, వెలుగు: జిల్లాలో బల్క్ ల్యాండ్ సమస్యల పరిష్కారానికి చేపట్టిన సర్వే ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ రెవెన్యూ ఆఫీసర్లను ఆదేశించారు. శుక్రవారం ఐడీవోసీ కార్యాలయంలో భూపాలపల్లి రెవెన్యూ డివిజన్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఆఫీసర్లతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న బల్క్ ల్యాండ్ సమస్యలను గ్రామాల వారీగా సర్వే చేసి నివేదికలు సమర్పించాలని, వాటి ఆధారంగా నోటీసులు జారీ చేసి పరిష్కరించాలని తహసీల్దార్లకు సూచించారు. రీ-సర్వేలో బల్క్ ల్యాండ్ సమస్యలున్న గ్రామాలకు ప్రాధాన్యం ఇవ్వాలని, పైలెట్ గ్రామాల నివేదికలను వెంటనే అందజేయాలన్నారు.
విధులు నిర్వర్తించని లైసెన్స్డ్ సర్వేయర్లకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. జిల్లాలో సాదా బైనామా కింద 39,300 దరఖాస్తులు రాగా, 26,698 పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. వాటిని త్వరగా పరిష్కరించాలని సూచించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియను స్పీడప్ చేయాలని, ప్రస్తుతం జిల్లాలో 83 శాతం పూర్తయ్యిందని తెలిపారు. టేకుమట్ల, మొగుళ్లపల్లి మండలాల్లో 99 శాతం పూర్తికాగా, భూపాలపల్లి మున్సిపాలిటీలో 70 శాతం మాత్రమే నమోదైందని, ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
