అన్నీ హైడ్రా చేస్తే మిగతా శాఖలు ఎందుకు? కోర్టు ధిక్కరణ కేసులో కనీసం క్షమాపణ కూడా చెప్పరా: హైకోర్టు

అన్నీ హైడ్రా చేస్తే మిగతా శాఖలు ఎందుకు? కోర్టు ధిక్కరణ కేసులో కనీసం క్షమాపణ కూడా చెప్పరా: హైకోర్టు
  • ఓ ప్రభుత్వ ఉత్తర్వుతో ఏర్పాటైన సంస్థకు ఇన్ని అధికారాలెక్కడివి?
  • హైడ్రా అఫిడవిట్‌‌‌‌ తర్వాతే ఆర్మీ మోహరింపుపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: హైడ్రా కమిషనర్ రంగనాథ్‌‌‌‌పై హైకోర్టు మరోసారి మండిపడింది. కోర్టు ఉత్తర్వులను పదేపదే ఉల్లంఘించడం, దానికి క్షమాపణ కూడా చెప్పకపోవడం హైకోర్టు చరిత్రలోనే ఇంతకు ముందెన్నడూ చూడని పరిణామాలని అసహనం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులను తప్పకుండా పాటిస్తామని హామీ ఇచ్చి.. దానికి విరుద్ధంగా వ్యవహరించడం ఏంటని మండిపడింది. కేవలం ఒక ప్రభుత్వ ఉత్తర్వుతో ఏర్పడిన సంస్థకు ఇంతటి అధికారాలు ఎలా వచ్చాయని ప్రశ్నించింది. 

ఆక్రమణల తొలగింపు, చెరువుల పరిరక్షణ, భూముల రక్షణ వంటి పనుల కోసం ఇప్పటికే చట్టబద్ధంగా ఏర్పడిన రెవెన్యూ, ఇరిగేషన్, జీహెచ్‌‌‌‌ఎంసీ, పోలీస్ వంటి బలమైన శాఖలు, ప్రత్యేక చట్టాలు ఉన్నాయని.. కానీ, ఆ పనుల్నింటిని హైడ్రాతో చేయించడమేంటని నిలదీసింది. అన్నీ హైడ్రా చేస్తే మిగతా చట్టాలు, శాఖలు ఎందుకు? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 

ఆర్మీ మోపరింపుపై స్పష్టత

మేడ్చల్‌‌‌‌-మల్కాజిగిరి జిల్లా లోత్‌‌‌‌కుంట గ్రామంలోని 40 ఎకరాల భూమిలో జూలై 17న హైడ్రా చేపట్టిన కూల్చివేతలపై శాంతా శ్రీరామ్ కన్ స్ట్రక్షన్ దాఖలు చేసిన మూడో కోర్టు ధిక్కరణ పిటిషన్‌‌‌‌ను జస్టిస్ జూకంటి అనిల్‌‌‌‌కుమార్ శుక్రవారం విచారించారు. పిటిషనర్ తరఫు న్యాయవాదులు వాదిస్తూ.. కోర్టు స్టే ఉన్నప్పటికీ హైడ్రా అధికారులు అక్రమంగా తమ స్థలంలోకి ప్రవేశించి ఆస్తులను ధ్వంసం చేశారని తెలిపారు. తాము ఆ భూమిలో ఎలాంటి జోక్యం చేసుకోలేదని పేర్కొన్నారు. 

అయితే కోర్టు ధిక్కరణ కేసులో కనీసం క్షమాపణ కూడా కోరకపోవడం కమిషనర్ మొండివైఖరికి నిదర్శనమని న్యాయమూర్తి మండిపడ్డారు. ప్రభుత్వ జీవోతో ఏర్పాటైనా హైడ్రా.. రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ చట్టాలను నిర్వీర్యం చేస్తున్నదన్నారు. అయినా, అడ్వకేట్ జనరల్ విజ్ఞప్తితోనే కమిషనర్‌‌‌‌ను అదుపులోకి తీసుకోకుండా సంయమనం పాటిస్తున్నామని స్పష్టం చేశారు. వివాదాస్పద స్థల రక్షణ కోసం సైన్యాన్ని  మోహరించాలంటూ జూలై 23న జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు రికార్డుల్లో కొనసాగుతాయని హైకోర్టు తెలిపింది. 

హైడ్రా కమిషనర్ సమర్పించబోయే అదనపు అఫిడవిట్ స్వరూపాన్ని పరిశీలించిన తర్వాతే ఆర్మీ రంగంలోకి దిగడంపై తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. రంగనాథ్ వ్యక్తిగతంగా తమ ముందు హాజరుకావాలని ఆదేశిస్తూ విచారణను జూలై 27కు వాయిదా వేశారు.