రుతురాజ్ సెంచరీ, అర్షద్ ఖాన్ మ్యాజిక్.. చివరి ఓవర్లో లంకపై భారత్ A థ్రిల్లింగ్ విక్టరీ

రుతురాజ్ సెంచరీ, అర్షద్ ఖాన్ మ్యాజిక్.. చివరి ఓవర్లో లంకపై భారత్ A థ్రిల్లింగ్ విక్టరీ

India A vs Sri Lanka A: శ్రీలంక పర్యటనలో ఉన్న భారత్ 'ఎ' (India A) జట్టు వన్డే సిరీస్‌లో ఉత్కంఠభరిత పోరులో ఘన విజయాన్ని నమోదు చేసింది. శ్రీలంక 'ఎ' జట్టుతో జరిగిన ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో టీమిండియా అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లోనూ సమిష్టిగా రాణించి లంకను వారి సొంత గడ్డపైనే చిత్తుగా ఓడించింది. చివరి ఓవర్ వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో భారత్ 8 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో జోష్ పెంచింది.

రుతురాజ్ గైక్వాడ్ సెంచరీ: 
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ జట్టుకు రుతురాజ్ గైక్వాడ్  అదిరిపోయే సెంచరీతో చెలరేగాడు. లంక బౌలర్లను నలుమూలలా బాదుతూ రుతురాజ్ శతకం చేయగా.. మరోవైపు కెప్టెన్ తిలక్ వర్మ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడుతూ అర్థ శతకంతో లంక ఫీల్డర్లను అల్లాడించాడు. వీరిద్దరి అద్భుత ప్రదర్శనతో భారత్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 277 పరుగుల భారీ స్కోరు చేసింది.

లంకను దెబ్బతీసిన ఆయుష్ బదోనీ: 
278 పరుగుల లక్ష్య ఛేదనకి దిగిన శ్రీలంక జట్టుకు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. లంక స్కోరు 93 పరుగుల వద్ద ఉండగా ప్రమాదకరంగా మారుతున్న అవిష్కా ఫెర్నాండోను ఆయుష్ బదోనీ అవుట్ చేసి భారత్‌కు బ్రేక్ త్రూ ఇచ్చాడు. ఆ కాసేపటికే సెట్ అయిన మరో ఓపెనర్ నిరోషన్ డిక్వెల్లా (47)ను కూడా బదోనీయే పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత 109 పరుగుల వద్ద నువానిడు ఫెర్నాండో (8) రూపంలో లంక మూడో వికెట్ కోల్పోయి తడబడింది. అయితే సదీర సమరవిక్రమ, సహన్ అరాచ్చిగేలు అద్భుత భాగస్వామ్యంతో లంకను మళ్లీ రేసులోకి తెచ్చారు. కానీ భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి వీరిద్దరినీ అవుట్ చేయడంతో లంక మిడిలార్డర్ పూర్తిగా చేతులెత్తేసింది.

►ALSO READ | ఆఫ్ఘన్‌తో వన్డే సిరిస్.. భారత్ తుది జట్టు ఇదేనా?

అర్షద్ ఖాన్ మ్యాజిక్: 
చివర్లో లంక బ్యాటర్ వనుజ సహాన్ మెరుపు వేగంతో బ్యాటింగ్ చేయడంతో మ్యాచ్ శ్రీలంక వైపు మొగ్గింది. లంక ఈజీగా గెలుస్తుందనుకున్న తరుణంలో 49వ ఓవర్ వేసిన అర్షద్ ఖాన్ మ్యాచ్ స్వరూపాన్నే పూర్తిగా మార్చేశాడు. ఒత్తిడిలోనూ అద్భుతమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేసిన అర్షద్.. ఆ ఓవర్లో కేవలం ఒక్కటంటే ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి.. 2 కీలక వికెట్లు పడగొట్టడంతో పాటు ఒక రనౌట్ చేసి లంక పతనాన్ని శాసించాడు. దీంతో భారత్ ‘ఎ’ జట్టు 8 పరుగుల తేడాతో సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది.