Manjari Fadnis: ఇంత క్రూరత్వమా? కమ్యూనిటీ డాగ్ని చంపేశారంటూ నటి ఆవేదన.. వీడియో వైరల్

Manjari Fadnis: ఇంత క్రూరత్వమా? కమ్యూనిటీ డాగ్ని చంపేశారంటూ నటి ఆవేదన.. వీడియో వైరల్

సినీ నటి మంజరి ఫడ్నిస్ షేర్ చేసిన ఓ ఎమోషనల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ముంబైలోని తన హౌసింగ్ సొసైటీలో నివసించే ‘మైకీ’ అనే కమ్యూనిటీ కుక్కను కొందరు దారుణంగా హత్య చేశారని మంజరి  ఆరోపిస్తూ ఇంస్టాగ్రామ్లో ఎమోషనల్ వీడియోను  పంచుకుంది. ఈ ఘటన గురించి చెబుతూ మంజరి భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకోవడంతో వేగంగా వైరల్ అవుతుంది. సొసైటీలోని కొందరు వ్యక్తులు మైకీపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు సమాచారం అందిందని మంజరి పేర్కొన్నారు. జంతువులపై హింసను అరికట్టేందుకు కఠినమైన చట్టాలు అవసరమని ఆమె డిమాండ్ చేశారు.

ఈడ్చుకెళ్లి రక్తం వచ్చేలా కొట్టారని..

నటి మంజరి తెలిపిన వివరాల ప్రకారం, మైకీ 2019 నుంచి తమ సొసైటీలోనే ఉంటుంది. అది ప్రతిఒక్కరికి ఎంతో చనువుగా ఉండటంతో, మైకీకి అన్నం పెట్టడం, స్నానం చేయించడం వంటి పనులు అందరూ చూసుకుంటూ వస్తున్నారు. ఇటీవల అది కనిపించకుండా పోవడంతో సొసైటీ సభ్యులు బయట పోస్టర్లు వేయడం, భద్రతా సిబ్బందిని ప్రశ్నించడం, పరిసర ప్రాంతాల్లో వెతకడం వంటి చర్యలు చేపట్టారు. అయితే, ఎక్కడ వెతికిన మైకీ ఆచూకీ లభించలేదు. ఆ తర్వాత బయటకు వచ్చిన వివరాలు తమను షాక్‌కు గురి చేశాయని మంజరి చెప్పారు.

మైకీ బేస్‌మెంట్‌లో ప్రశాంతంగా నిద్రిస్తున్న సమయంలో కొందరు దాని తలపై కర్ర లేదా ఇనుపరాడ్‌తో దాడి చేసినట్లు ఆరోపించారు. తీవ్ర గాయాలతో అయోమయ స్థితికి చేరిన కుక్కను బీ1 పార్కింగ్, లాబీ మధ్య ఉన్న మెట్ల ప్రాంతానికి ఈడ్చుకెళ్లి మరింతగా కొట్టారని, నోటి నుంచి రక్తం వచ్చే వరకు హింసించారని తెలిపారు.

వీడియోలో మంజరి మాట్లాడుతూ, “ఈ వీడియో చేయాల్సిన అవసరం రాకపోయి ఉంటే బాగుండేది. కానీ ఇది చెప్పడం చాలా ముఖ్యం” అని అన్నారు. మైకీ చాలా మృదుస్వభావం గల కుక్క అని, అందరూ దానిని ప్రేమగా చూసుకునేవారని పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా, మైకీని ఒక సంచిలో వేసి బిల్డింగ్ వెనుక ఉన్న ఖాళీ ప్రదేశంలో పడేశారని మంజరి ఆరోపించారు.

ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కావడంతో జంతు ప్రేమికులు, సినీ ప్రముఖులు మంజరికి మద్దతు తెలుపుతూ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వారిలో భూమి పెడ్నేకర్, వేదిక, డింపుల్ హయాతీ తదితరులు ఉన్నారు. మైకీకి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని మంజరి స్పష్టం చేశారు.

నటి మంజరి విషయానికి వస్తే, “జానే తూ... యా జానే నా' చిత్రంతో గుర్తింపు పొందిన మంజరి, తెలుగులో అల్లరి నరేష్ తో ‘సిద్ధూ ఫ్రమ్‌ శ్రీకాకుళం’, ‘శుభప్రదం’ చిత్రాల్లో నటించింది. అలాగే ఎన్టీఆర్‌ హీరోగా వచ్చిన ‘శక్తి’లో గౌరిగా కనిపించి ఆకట్టుకుంది. 

ALSO READ :  లీకైన 'బిగ్ బాస్ తెలుగు సీజన్10' హౌస్ పిక్స్...