కొత్త డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్ తెస్తున్న కేంద్రం : 50 ఏళ్ల వయస్సు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడిటీ!

కొత్త డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్ తెస్తున్న కేంద్రం : 50 ఏళ్ల వయస్సు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడిటీ!

దేశంలోని కోట్ల మంది వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పబోతోంది. ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగిసిపోతుందని, మాటిమాటికి RTO ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన తిప్పలు తప్పనున్నాయి. డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడిటీని ఏకంగా 50 ఏళ్ల వయస్సు వచ్చేంత వరకు పొడిగించేలా ఒక ప్రతిపాదనను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది. రవాణా రంగ సేవలను మరింత సులభతరం చేస్తూ.. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా ఈ భారీ సంస్కరణకు అడుగులు పడుతున్నాయి.

ప్రస్తుతం ఉన్న రూల్స్ ప్రకారం.. డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న తర్వాతి నుంచి 20 ఏళ్ల పాటు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఆ తర్వాత మళ్లీ మెడికల్ సర్టిఫికెట్లు, ఇతర డాక్యుమెంట్లు సమర్పించి రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ కొత్త ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే.. ఒకసారి లైసెన్స్ తీసుకుంటే చాలు 50 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా వాహనం నడుపుకోవచ్చు. దీనివల్ల ఆర్‌టీఓ ఆఫీసుల్లో పేపర్‌వర్క్, క్యూ లైన్లు తగ్గడమే కాకుండా వాహనదారులపై ఉన్న పెద్ద భారం తొలగిపోతుంది.

కేవలం లైసెన్స్ గడువు మాత్రమే కాకుండా.. వాహనాల ఓనర్‌షిప్ బదిలీ, పర్మిట్ల రెన్యూవల్స్ వంటి సేవలను కూడా పూర్తిగా ఆన్‌లైన్ చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఈ డిజిటలైజేషన్ వల్ల ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఇంట్లో కూర్చుని పనులు పూర్తి చేసుకోవచ్చు. అయితే రెన్యూవల్స్ తగ్గితే రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం పడిపోతుందని కొన్ని రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై కేంద్రం స్పందిస్తూ.. ఆన్‌లైన్ ద్వారా ఫీజుల వసూలు ప్రక్రియ కొనసాగుతుందని, దీనివల్ల ప్రభుత్వాల ఆదాయానికి ఎలాంటి ఇబ్బంది ఉండబోదని స్పష్టం చేసింది.

ALSO READ : బిర్యానీలో ఈగ.. హోటల్ పై జరిమానాతో పాటు 10 ప్లేట్ల బిర్యానీ ఫ్రీగా ఇవ్వమన్న కోర్టు

లైసెన్స్ రూల్స్ సులభతరం చేస్తున్నప్పటికీ ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే వారికి మాత్రం కేంద్రం గట్టి షాక్ ఇవ్వబోతోంది. తప్పులు చేసే డ్రైవర్లను అడ్డుకోవడానికి నెగటివ్ పాయింట్స్ సిస్టమ్‌ను తీసుకురానున్నారు. ఎవరైనా పదే పదే ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే.. వారి లైసెన్స్‌కు నెగటివ్ పాయింట్లు పడతాయి. ఒక పరిమితి దాటితే ఆ లైసెన్స్‌ను శాశ్వతంగా సస్పెండ్, రద్దు చేసేలా వ్యవస్థను లింక్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ చర్చలు ప్రారంభ దశలోనే ఉన్నప్పటికీ.. సరికొత్త డిజిటల్ సంస్కరణలు అమలులోకి వస్తే మాత్రం దేశంలో డ్రైవింగ్ సిస్టమ్ మొత్తం పూర్తిగా మారిపోవడం ఖాయం అని తెలుస్తోంది.