మూడోసారీ ఆడపిల్లేనని అబార్షన్..మహిళ మృతి..జనగామ జిల్లాలో ఘటన, ఇద్దరు అరెస్ట్

మూడోసారీ ఆడపిల్లేనని అబార్షన్..మహిళ మృతి..జనగామ జిల్లాలో ఘటన, ఇద్దరు అరెస్ట్

జనగామ అర్బన్, వెలుగు : మూడో సారీ ఆడపిల్లే అని తేలడంతో అబార్షన్ చేసుకున్న మహిళ తీవ్ర రక్తస్రావంతో చనిపోయింది. మహిళ మృతికి కారణమైన నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే... జనగామ జిల్లా రఘునాథపల్లి మండలానికి చెందిన భాస్కర్ గౌడ్ కు దేవరుప్పుల మండలం కొలుకొండ గ్రామానికి చెందిన శ్రావణి (35)తో వివాహమైంది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. భాస్కర్ గౌడ్ హైదరాబాద్ లో ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు.

 శ్రావణి మూడోసారి గర్భం దాల్చడంతో కొన్ని రోజులుగా తల్లిగారింట్లో ఉంటోంది. ఇటీవల శ్రావణి, ఆమె తల్లి శోభ హనుమకొండలోని ఓ ప్రైవేట్ డయాగ్నోస్టిక్స్ సెంటర్ నిర్వాహకుడు ప్రవీణ్ దగ్గరకు వెళ్లగా.. అతడు శ్రావణిని పరీక్షించి కడుపులో ఉన్నది ఆడపిల్ల అని చెప్పాడు. ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉండగా.. మళ్లీ అమ్మాయి అని తేలడంతో అబార్షన్ చేయించాలని నిర్ణయించారు. దీంతో కోలుకొండకు చెందిన ఆర్ఎంపీ రచ్చ శ్రావణ్ కుమార్ సహకారంతో జనగామలోని సంజయ్ నగర్ కు చెందిన ప్రైవేట్ ఏఎన్ఎం అనసూయను కలిశారు. 

ఆమె ఈ నెల 21న తన ఇంట్లోనే శ్రావణికి అబార్షన్ చేసింది. తర్వాతి తోరు శ్రావణికి తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే సికింద్రాబాద్ లోని గాంధీ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ ట్రీట్ మెంట్ తీసుకుంటూ శనివారం తెల్లవారుజామున శ్రావణి చనిపోయింది. భర్త భాస్కర్ గౌడ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఏఎన్ఎం అనసూయ, ఆర్ఎంపీ రచ్చ శ్రావణ్ కుమార్ ను ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. అబార్షన్ కు ప్రోత్సహించిన మృతురాలి తల్లి శోభ, స్కానింగ్ చేసిన డయగ్నోస్టిక్ సెంటర్​ నిర్వాహకుడు ప్రవీణ్​పరారీలో ఉన్నారని జనగామ సీఐ సత్యానారాయణ రెడ్డి తెలిపారు.