పద్యం రాయడం అంత సులభమేమీ కాదు. ఛందస్సు కుదరాలి. చెప్పాలనుకున్న భావం కవితాత్మకంగా వ్యక్తం చేయాలి. సంధులు, సమాసాలకు సంబంధించిన వ్యాకరణ జ్ఞానం ఉండాలి. అలవోకగా అలంకారాలు ప్రయోగించాలి. పైగా ఇప్పటికే రాసిన కవులకంటే భిన్నంగా వ్యక్తీకరించాలి. అది చదివినవారికి రసపుష్టి కలగాలి. అలాంటి లక్షణాలన్నీ దేవరకొండ భగవాన్ వెలువరించిన పద్య కావ్యం ‘‘ప్రాస్తావిక పద్యమాలిక’’ నిండా పరుచుకుని ఉన్నాయి.
కవిత్వంలోని రసపుష్టి గురించి, శిల్ప చాతుర్యాన్ని గురించి, ఛందో ప్రయోగాలను గురించి పద్య కవులు, లేదా ప్రాచీన సాహిత్య విమర్శకులు ఇప్పటికే ఎంతో చెప్పి ఉన్నారు. ఈ నేపథ్యం నుంచి చూసినప్పుడు ఈ కవిత్వం నిండా సామాజిక స్పృహ పరచుకుని ఉంది. ముఖ్యంగా ఇవాళ్టి సమాజపు ద్వంద్వ విలువలను ఈసడించుకునేతనం ఉంది. అందుకే ఈ కవిత్వం ఎవ్వరికైనా నచ్చుతుంది.
తన చుట్టూ ఉన్న సమాజాన్ని చూసి స్పందించకుండా ఉండలేనితనం ఉంది. ఇప్పటి తరానికి ఒక మార్గాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. మనిషి విలువను, మట్టి విలువను బోధిస్తున్నాడు. మొద్దునిద్రపోతూ దారితప్పుతున్న వారి చెంపల మీద సరిచి హెచ్చరిస్తున్నాడు. ఈ పద్యాలు చదువుతున్నప్పుడు నాకు ప్రజాకవి వేమన గుర్తుకొచ్చాడు. ఆటవెలదిలో పద్యమల్లి లోకం పోకడ మీద ఈటెలా విసిరాడు వేమన. ఆయన మార్గంలో ఈ కవి భగవాన్ సైతం మనుషుల అసలు ముఖాలను బయటపెడుతున్నాడు.
తీర్థ యాత్రలెన్నొ తిరిగినప్పటికైన
ముక్తి కలుగదాయె ముదిమి యైన
భక్తిలేని చోట భగవంతుడుండునా
తెలిసి నడువు మోయి తెలుగు వీర!
అంటూ ఇవాళ్టి కాలానికి అవసరమైన పద్యాన్ని రచించాడు. అలాగే రైతు లేకుంటే అన్నమే లేదంటూ గుర్తు చేస్తున్నాడు. గ్లోబలైజేషన్ వంటి పోకడల వల్ల కనుమరుగవుతున్న కళాకారుల దుఃఖానికి తన గొంతుకనిస్తున్నాడు. అవినీతిపరుల బండారం బయటపెడుతున్నాడు. చదువు ప్రాముఖ్యతను చక్కగా ఎలుగెత్తి చాటుతున్నాడు. ఆధునిక కాలపు విపరీత పోకడలను సైతం ఎండగట్టాడు. అలాగే రాజకీయ నాయకుల చిత్తశుద్ధిలేనితనాన్ని శంకించాడీ కవి.
ఓట్లు వచ్చినప్పుడు వచ్చి నోట్లు పంచు
హామీలెన్నింటినో యిచ్చి హాయిగాను
గెలుపు గుర్రమునెక్కి కొలువు జేరి
మాటలన్ని మరిచి తాను మంత్రి యౌను
అంటూ నేటి నేతల గుట్టు రట్టు చేశాడు.
ఈ రకమైన భావావేశం ఉన్నవారే కవిత్వం రాయగలరు. రాజ్యాన్ని ధిక్కరించిన బమ్మెర పోతన, సామాజిక అసమానతలను జాను తెనుగుతో బద్దలు కొట్టిన పాల్కుర్కి సోమన అడుగుజాడల్లో నడుస్తున్న ఈ కవిని చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఇన్ని విషయాల మీద ఇంత గాఢతతో పద్య కవిత్వమై పోటెత్తిన తీరు అభినందనీయం. ఈ సంపుటిలో వ్యక్తుల కృషిని సైతం పద్యాల్లో లిఖించాడీ కవి.
తాను ఎంచుకున్న ప్రక్రియ ప్రాచీనమైనదైనా, వస్తువు మాత్రం నవీనమైనది. ఇవాళ్టి సమాజానికి అవసరమైనది. ఫేస్‌బుక్‌తో పొద్దుపొడిసి, వాట్సప్ పొద్దుకుతున్న ఈ జెన్‌జీ తరాన్ని మేల్కొలిపే కవిత్వం ఇది. ఇంతటి సామాజిక బాధ్యతతో పద్యకవిత్వం రాసే కవులు అరుదు. పద్య ప్రక్రియలో ఎక్కువగా ఆధ్యాత్మిక చింతన, తాత్విక గాఢత, భక్తిభావనలతో కూడుకున్న కవిత్వమే నిత్యం వెలువడుతుంటుంది. ఈ కవి మాత్రం కొత్త దారిని ఎంచుకున్నాడు.
తన చుట్టూ ఉన్న సమాజాన్నే వస్తువుగా చేసుకున్నాడు. ఇట్లా ప్రాచీన సాహితీ ప్రక్రియలో సైతం ఆధునికతను జోడించి, ప్రయోగాలు చేసే కవులు బహు అరుదు. అలాంటి అరుదైన కవి దేవరకొండ భగవాన్. కళ సామాజిక ప్రయోజనం కోసం అని వాదించేవారిలో ఈయనొకరు. ఈ ఆధునిక కాలం. ఈ కాలంలో ఏ సృజనకారుడైనా తన చుట్టూ ఉన్న సమాజ విముక్తి కోసమే రాయాలి.
అప్పుడే ఆ అక్షరాలకు సార్థకత. మరి అలాంటి సామాజిక బాధ్యతతో కలం ఝుళిపిస్తున్న కవి దేవరకొండ భగవాన్. ‘‘శుద్ధ సాహిత్యమంటూ ఏదీ ఉండదు, అది సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిణామాలతో ముడిపడి ఉంటుంది’’ అని పాశ్చాత్య సాహిత్య విమర్శకుడు టెర్రీ ఈగల్టన్ అన్న మాట ఈ కవికి సరిగ్గా సరిపోతుంది.
- డా.పసునూరి రవీందర్, కవి, రచయిత
తెలంగాణ రాష్ర్ట తొలి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత
లైఫ్& లిటరేచర్ పేజీకి వ్యాసాలు పంపాల్సిన మెయిల్ ఐడీ featureseditor@v6velugu.com
