అవసరం అయితేనే ఉద్యోగులను తీసుకుంటాం.. గతంలో మాదిరిగాఎక్కువ మందిని తీసుకోం: TCS

అవసరం అయితేనే ఉద్యోగులను తీసుకుంటాం.. గతంలో మాదిరిగాఎక్కువ మందిని తీసుకోం: TCS

దేశంలో ఐటీ రిక్రూట్మెంట్స్ ట్రెండ్ పూర్తిగా మారిపోబోతోంది. టెక్ దిగ్గజం టీసీఎస్ భవిష్యత్తులో గతంలో లాగా భారీ స్థాయిలో టెక్కీలను తీసుకోబోమని స్పష్టం చేసింది. ఏఐ ఏజెంట్లు మనుషులు చేసే పనులను వేగంగా భర్తీ చేస్తుండటమే ఇందుకు ప్రధాన కారణం. టీసీఎస్ 31వ ఏజీఎంలో టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఐటీ పరిశ్రమలో సరికొత్త చర్చకు దారితీశాయి. ఏఐతో కలిసి పనిచేసుకునే వారికే భవిష్యత్తు. ఉద్యోగులకు సమానంగా ఏఐ ఏజెంట్లు ఉంటాయని, ఇదే ఐటీ రంగం భవిష్యత్తు వర్క్ ఫార్మాట్ అని చెప్పారు. 

గతంలో ఐటీ రంగం అంటేనే వేల సంఖ్యలో ఇంజనీర్లను క్యాంపస్ రిక్రూట్‌మెంట్ల ద్వారా ఏరికోరి ఎంపిక చేసుకోవడం. కానీ ఇకపై ఆ రోజులు ముగిసిపోయినట్లేనని చంద్రశేఖరన్  తెలిపారు. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, బిజినెస్ ప్రాసెస్‌లలో ఏఐ ఏజెంట్లు ఉద్యోగులతో కలిసి పనిచేయడం పెరిగిపోతుందని, దీనివల్ల కేవలం టీసీఎస్‌లోనే కాకుండా మొత్తం ఐటీ పరిశ్రమలోనే కొత్త ఉద్యోగాల సంఖ్య తగ్గుతుందని చెప్పారు. గత ఏడాది లేఆఫ్స్ తర్వాత ప్రస్తుతం చంద్రశేఖరన్ మాటలు విన్న టెక్కీలు ఆందోళన చెందుతున్నారు. 

ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కంపెనీలో ఎలాంటి సిబ్బంది తగ్గింపు ప్లాన్స్ ప్రస్తుతానికి లేవని చంద్రశేఖరన్ పేర్కొన్నారు. మనుషులు, ఏఐ ఏజెంట్లు కలిసి పనిచేసే సరికొత్త హైబ్రిడ్ వ్యవస్థ రాబోతోందని, దీనికోసం కొత్త స్కిల్స్ కలిగిన ప్రతిభావంతులను రిక్రూట్ చేసుకుంటుందని చెప్పారు. ఒక క్రేజీ అంచనా ప్రకారం.. భవిష్యత్తులో కంపెనీలో ఎంతమంది ఉద్యోగులు ఉంటారో.. అంతే సంఖ్యలో ఏఐ ఏజెంట్లు కూడా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. కంపెనీలో 5 లక్షల మంది ఉద్యోగులు ఉంటే.. 5 లక్షల ఏఐ ఏజెంట్లు ఉండే రోజులు చాలా దగ్గర్లోనే ఉన్నాయని చంద్రశేఖరన్ చెప్పిన మాటలు అందరినీ షాక్ కి గురిచేస్తున్నాయి. 

ALSO READ : పెట్రోల్ కంటే డీజిల్‌పైనే భారీగా నష్టాలు..

పెరుగుతున్న ఈ ఏఐ విప్లవాన్ని టీసీఎస్ ఒక అద్భుతమైన వ్యాపార అవకాశంగా చూస్తోంది. ప్రస్తుతం టీసీఎస్ వార్షిక ఏఐ రెవెన్యూ దాదాపు 2.5 బిలియన్ డాలర్ల మార్కుకు చేరువలో ఉండగా.. ప్రతి ఏటా ఈ ఆదాయాన్ని రెట్టింపు చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. 2028-2030 నాటికి కంపెనీ సాధించే ప్రతి రూపాయి ఆదాయంలోనూ ఏఐ భాగస్వామ్యం ఉంటుందని చంద్రశేఖరన్ ధీమా వ్యక్తం చేశారు. ఇందుకోసం టీసీఎస్ సంస్థ ఏఐ టాలెంట్, ఇండస్ట్రీ-స్పెసిఫిక్ ఏఐ ఏజెంట్లు, డేటా సెంటర్లు, సావరిన్ క్లౌడ్ మౌలిక సదుపాయాలపై భారీగా పెట్టుబడులు పెడుతోంది. మొత్తానికి ఐటీ జాబ్స్ మార్కెట్‌లో రాబోయే రోజుల్లో క్వాలిటీ స్కిల్ సెట్ ఉన్నోళ్లకే జాబ్ ఆఫర్స్ వస్తాయని చెప్పాలి.