ముంబై: సాధారణ పౌరులను తమ పనుల కోసం కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవద్దని, వారి ప్రయోజనాల కోసం బాధ్యతాయుతంగా పనిచేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారులను హెచ్చరించారు. ముంబై నారీమన్ పాయింట్ బిజినెస్ డిస్ట్రిక్ట్‌లో ఆదాయపు పన్ను శాఖకు చెందిన కొత్త 13 అంతస్తుల కార్యాలయ సముదాయం ‘ఆదాయకర్ సింధు’ను ఆదివారం మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 1.13 లక్షల చదరపు అడుగుల వైశాల్యం గల ఈ స్థలం 1973 నుంచే ఐటీ శాఖ వద్ద ఉందని, కానీ ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ఆక్రమణలకు గురైందని మండిపడ్డారు. "మీకు ఐటీ శాఖ దన్నుంది. మీరే ఒక భవన నిర్మాణ అనుమతుల కోసం దశాబ్దాలుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చింది. అలాంటప్పుడు మీ వద్దకు వచ్చే సామాన్య పౌరుడి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అర్థం చేసుకోండి. మీ అధికార పరిధిలోని పనుల కోసం ప్రజలను తిప్పలు పెట్టకుండా వెంటనే చేసిపెట్టండి" అని ఐటీ అధికారులకు సూచించారు.
