సిద్దిపేట రూరల్, వెలుగు: సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి నుంచి పోలీసుల కళ్లుగప్పి పరారైన ఖైదీని సిద్దిపేట పోలీసులు అరెస్ట్ చేశారు. మెదక్ జిల్లా వెల్దుర్తి గ్రామానికి చెందిన జొన్నల సాయికుమార్ వరుస వాహనాల దొంగతనాల కేసులో ఈ నెల 15న పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు.
సిద్దిపేట జిల్లా జైలు నుంచి శనివారం సాయి కుమార్ తో పాటు మరో ఆరుగురు ఖైదీలను జనరల్ చెకప్ కోసం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా, హ్యాండ్ కప్స్ తో పాటు లీడింగ్ చైన్ తీసేసుకుని ఎమర్జెన్సీ డోర్ నుంచి బయటకు దూకి సమీపంలోని సందులో నుంచి పారిపోయాడు.
వెంటనే స్పందించిన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, సీసీ పుటేజీ ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టి, ఆదివారం మధ్యాహ్నం కామారెడ్డి రైల్వేస్టేషన్ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. పారిపోయిన ఖైదీని అరెస్ట్ చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాళ్ అభినందించారు.
